
అమ్మవారి ఊరేగింపు అడ్డగింత
– డీఎస్పీకి ఫిర్యాదు
తిరుత్తణి: అమ్మవారి ఊరేగింపును అడ్డుకోవడంపై చర్యలు తీసుకోవాలని పదిమంది కుటుంబీకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుత్తణి యూనియన్‌లోని సూర్యనగరం పంచాయతీలోని రామాపురం గ్రామంలో వందకు పైగా కుటుంబీకులు నివాశముంటున్నారు. ఆగ్రామంలో ప్రతి ఏటా ఆడి నెలలో పడవేట్టమ్మన్ ఆలయ జాతర నిర్వహించడం పరిపాటి. వచ్చే శుక్రవారం వేడుకలు సందర్భంగా బుధవారం రాత్రి గ్రామంలో సమావేశం నిర్వహించి గ్రామానికి హద్దు వరకు మాత్రమే అమ్మవారిని ఊరేగించాలని వెలుపల ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకెళ్లరాదని నిర్ణయించారు. దీంతో గ్రామానికి చెందిన పది కుటుంబీకులు ప్రభుత్వం అందజేసిన ఉచిత ఇంటి పట్టాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాశముంటున్న ప్రాంతం కొండ జాతి ప్రజలు నివాశముంటున్న ప్రాంతం కావడంతో తమ ప్రాంతానికి అమ్మవారి ఊరేగింపును గ్రామంలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపిస్తూ డీఎస్పీ కందన్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కందన్ గ్రామానికి చెందిన ఆలయ పెద్దలను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఏటా అమ్మవారిని గ్రామ హద్దు వరకు మాత్రమే ఊరేగించడం పరిపాటి. ఆ ప్రకారం మాత్రమే ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తున్నాం. కొత్తగా హద్దులు దాటి అమ్మవారిని ఊరేగించడం సాధ్యంకాదని తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య చర్చలు నిర్వహించి సమస్య పరిష్కరిస్తామని డీఎస్పీ తెలిపారు.