తిరువొత్తియూరు: నామక్కల్ ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న దక్షిణ మండల ఎల్పీజీ ట్యాంకర్ యజమానుల సంఘం గురువారం నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటున్నట్టు ఆ సంఘ అధ్యక్షుడు ప్రకటించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో ఈ సంఘం నుంచి సుమారు 1500 మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి సొంతమైన సుమారు ఆరువేల ట్యాంకర్ లారీలు అద్దెకు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియంతో సహా ఆయిల్ సంస్థలకు కాంట్రాక్టు విధానంలో ఈ లారీలు నడుస్తూ ఉన్నాయి. వచ్చే ఆగస్టుతో పాత ఒప్పందం ముగియనుంది. ఆ తర్వాత సెప్టెంబర్1 నుంచి అమలు చేయనున్న కొత్త ఒప్పందంలోని నిబంధనలు ట్యాంకర్ లారీ యజమానులకు అనుకూలంగా లేవని, తమకు సడలింపులు ఇవ్వాలని సంఘం విజ్ఞప్తి చేసింది. అయితే ఆయిల్ సంస్థల నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో బుధవారం దక్షిణ మండల ఎల్పీజీ టాంకర్ లారీ యజమానుల సంఘం నిర్వాహకులు సమావేశమై చర్చించారు. గురువారం నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటున్నట్టు ప్రకటించారు. సమ్మె మూలాన 4000 ఎల్పీజీ ట్యాంకర్ లారీలు నడవవని, 10 చోట్ల లోడ్‌ను ఎక్కించకుండా లారీలను నిలిపి వేయనున్నట్టు వెల్లడించారు. గ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు పడితే దానికి ఆయిల్ సంస్థలే బాధ్యత వహించాలన్నారు.


