బావిలో పడి తల్లీకుమారుడి మృతి
పేర్నంబట్టులో విషాదం
వేలూరు: వేలూరు జిల్లా, పేర్నంబట్టులో విషాదం అలముకుంది. బావిలో పడి తల్లీకుమారుడు మృతిచెందడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాలు.. వేలూరు జిల్లా, పేర్నంబట్టు సమీపంలోని గౌరవపేట గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ చైన్నెలోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య సంగీత(26). వీరికి కుమారుడు ఆదిమాన్(5), 11 నెల ఆడ శిశువు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సంగీత తన ఇద్దరు పిల్లలతో కలిసి వ్యవసాయ భావి వద్దకు వెళ్లింది. బావి పక్కనే నడిచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో పడింది. వెంటనే కేకలు వేయడంతో స్థానికులు గమనించి బావి వద్దకు చేరుకున్నారు. బావి గట్టు వద్ద పడి ఉన్న ఆడ శిశువును బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదిమాన్ బావిలోనే మృతిచెందగా.. కొన ఊపిరితో ఉన్న సంగీతను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.