
సమస్యలను పరిష్కరించండి
● కలెక్టర్‌కు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ వినతి
తిరువళ్లూరు: నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు నిధులను కేటాయించాలని కోరుతూ కలెక్టర్ ప్రతాప్ తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ శుక్రవారం కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తిరువళ్లూరు నియోజవర్గంలోని సమస్యలు, ప్రజలు ఇచ్చిన వినతుల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ కలెక్టర్ ప్రతాప్‌తో దాదాపు గంట సమయం చర్చించారు. ప్రజల నుంచి పింఛన్, పక్కాగృహాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల వినతులను కలెక్టర్‌కు సమర్పించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిస్కరించాలని సూచించారు. అనంతరం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారు. రోడ్లు, రవాణా సదుపాయం, పక్కాగృహాలు, వీదిధీపాల ఏర్పాటు తదితర వాటికి అవసరమైన నిధులను తన ఫండ్ నుంచి కేటాయించాలని కోరారు. పాఠశాలలు త్వరలో ప్రారంభం కానున్న క్రమంలో పుస్తకాలు, యూనిఫామ్‌ను సైతం సకాలంలో అందజేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రత్యేకంగా గత నాలుగేళ్లలో ముఖ్యమంత్రి సహకారంతో ధీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. భవిషత్తులోనూ మరిన్ని అభివృద్ధి పనులను చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్రావిడ భక్తన్, యూనియన్ కార్యదర్శులు గూలూరు రాజేంద్రన్, కొండంజేరి రమేష్, మహాలింగం, యూనియన్ ఉప కార్యదర్శి కాంచీపాడి శరవణన్, వర్తక విభాగం ఆర్గనైజర్ వీఎస్ నేతాజీ, మున్సిపల్ మాజీ చైర్మన్ పొన్‌పాండ్యన్, యువజన విభాగం జిల్లా ఉప కార్యదర్శి మోతీలాల్, ఎన్‌ఆర్‌ఐ వింగ్ జిల్లా కార్యదర్శి జయకృష్ణ పాల్గొన్నారు.