భూ ఆక్రమణకు యత్నం
● ఎస్పీకి ఫిర్యాదు
తిరువళ్లూరు: రూ.2 కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్న కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు శుక్రవారం ఉదయం ఎస్పీ శ్రీనివాస పెరుమాల్‌కు వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ నుంగబాక్కంలో 1996వ సంవత్సరంలో కొందరు ప్లాట్‌లు వేసి విక్రయించారు. ఈ క్రమంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 13 మంది ప్లాట్లను కొనుగోలు చేసి, మనవాలనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకున్నారు. అనంతరం రెవెన్యూ ద్వారా పట్టాలు సైతం పొందారు. ఈ క్రమంలో కొందరు సంబంధిత స్థలాన్ని శుభ్రం చేసి ఇళ్లు నిర్మించుకోవాలని నిర్ణయించి, పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు సంబంధిత భూమి తమదని బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ స్థలంలో ఇళ్లు నిర్మించవద్దని హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు శుక్రవారం ఎస్పీ శ్రీనివాసపెరుమాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమపై బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. వినతి పత్రం స్వీకరించిన ఎస్పీ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


