పన్నీరు ‘ఉప’ పదవికి ఎసరు | - | Sakshi
Sakshi News home page

పన్నీరు ‘ఉప’ పదవికి ఎసరు

Mar 30 2023 7:37 AM | Updated on Mar 30 2023 7:37 AM

- - Sakshi

అన్నాడీఎంకే పళణి స్వామి గుప్పెట్లోకి చేరడంతో డైలమాలో పడ్డ పన్నీరు సెల్వంకు మరో దెబ్బ తగిలే అవకాశాలు

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పళణి స్వామి గుప్పెట్లోకి చేరడంతో డైలమాలో పడ్డ పన్నీరు సెల్వంకు మరో దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేతిలో ఉన్న పార్టీ శాసన సభా పక్ష ఉప నేత పదవికి ఎసరు పెట్టేందుకు పళణి శిబిరం సిద్ధమైంది. బుధవారం స్పీకర్‌ అప్పావును కలిసి అన్నాడీఎంకే విప్‌ ఎస్పీ వేలుమణి కోర్టు తీర్పుపై చర్చించారు. వివరాలు.. అన్నాడీఎంకే ఆధిపత్య సమరంలో కోర్టు తీర్పుతో పళణి స్వామి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టినానంతరం పార్టీపై పట్టు బిగించే పనిలో పళణి నిమగ్నం అయ్యారు.

ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి పన్నీరును బయటకుపంపించడం, కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం వంటి అంశాలను పళణి శిబిరం పరిగణనలోకి తీసుకుంది. పన్నీరు సెల్వం పదవికి ఎసరు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇది వరకే పన్నీరు సెల్వంను ఆ పదవి నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే శాసన సభాపక్షం తీర్మానం చేసినా, స్పీకర్‌ అప్పావు ఇంత వరకు స్పందించ లేదు. పన్నీరును తప్పించి ఆ పదవిలో తమ శిబిరం నేత ఆర్‌బీ ఉదయకుమార్‌ను నియమించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. దీంతో సభలో పళణి, పన్నీరు పక్క పక్కనే కూర్చోవాల్సిన పరిస్థితి.

ఈసారి వదలి పెట్టం..
ఇది వరకు వ్యవహారం కోర్టులో ఉండడంతో స్పీకర్‌ ఉప నేత పదవి విషయంగా ఆచీ తూచీ స్పందించారు. పన్నీరును ఆ సీటులో కూర్చునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే వ్యవహారంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం,ప్రధాన కార్యదర్శి పదవిని తమ నేత పళని స్వామి స్వీకరించడంతో ఇక, పన్నీరును ఆ సీటులో కూర్చోబెట్టేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని మెజారిటీశాతం ఎమ్మెల్యేలు స్పీకర్‌పై ఒత్తిడికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముందుగా అన్నాడీఎంకే విప్‌ ఎస్పీ వేలుమణి బుధవారం స్పీకర్‌ అప్పావును కలిసి విషయాన్ని ప్రస్తావించారు. తమ పార్టీతో సంబంధం లేని వ్యక్తిని ఎలా ఉప నేత సీటులో కూర్చోబెడుతారని, తక్షణం ఆయన్ని తప్పించి, ఆర్‌బీ ఉదయకుమార్‌ ఆ స్థానంలో నియమించాలని కోరారు.

స్పీకర్‌ ఒకటి రెండు రోజుల్లో స్పందించని పక్షంలో ఎమ్మెల్యేలతో సభను స్తంభింప చేయడానికి పళణి స్వామి సిద్ధం అవుతుండడం గమనార్హం. కాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉదయం అసెంబ్లీలో పళణిస్వామి అడుగుపెట్టగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు గుద్ది మరీ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలకడం విశేషం. ఇదిలా ఉండగా మంగళవారం వెలువడ్డ తీర్పునకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ విచారణ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం పన్నీరు శిబిరానికి చెందిన వైద్యలింగం, మనోజ్‌ పాండియన్‌, జేసీడీ ప్రభాకర్‌లు సైతం వేర్వేరుగా పళణికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. అందుకే బుధవారం జరగాల్సిన విచారణ ఒక రోజు వెనక్కి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement