కోర్సులు తిరోగమనం.. ఆస్తులు పరాధీనం | - | Sakshi
Sakshi News home page

కోర్సులు తిరోగమనం.. ఆస్తులు పరాధీనం

Oct 6 2026 2:18 AM | Updated on Oct 6 2026 2:18 AM

కోదాడ : ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతో మందికి ఉన్నత విద్యను అందించి ఉన్నత స్థానాల్లో నిలిపిన కోదాడ కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వసతుల లేమి, అధ్యాపకుల కొరతతో తమకు మంజూరైన కోర్సులు సైతం నిర్వహించలేని పరిస్థితి నెలకొనగా.. విద్యాసంస్థ ఆస్తులు సైతం పరాధీనమవుతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన పీజీ భవనం ‘టాస్క్‌’ పరం కాగా.. 22 ఎకరాల స్థలం నవోదయకు కేటాయించారు. మిగిలిన స్థలానికి ప్రహరీ లేక ఆక్రమణల పాలవుతుతోంది. దాంతో కళాశాల భవిష్యత్‌పై పూర్వ విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కనీస వసతులు కరువు...

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1968లో కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. తరువాత క్రమంగా కళా శాలను అప్‌గ్రేడ్‌ చేస్తూ 2016లో పీజీ స్థాయికి తీసుకెళ్లారు. అయితే కళాశాలకు కావాల్సిన కనీస వసతులు కల్పంచక పోవడం, పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించక పోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గి కళాశాల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతోంది. 50 సంవత్సరాల క్రితం కట్టిన కళాశాల ప్రధాన భవన శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతోంది. తాగునీటి వసతి సైతం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కళాశాలలో విద్యుత్‌ వైరింగ్‌ పాడై నిత్యం షాట్‌ సర్వ్యూట్‌తో తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కళాశాలలో కంప్యూటర్లుసైతం సక్రమంగా పనిచేయడం లేదు.

ప్రహరీ లేక ఆక్రమణలు..

కళాశాలకు 45 ఎకరాల స్థలం ఉంది. దీనిచుట్టూ ప్రహరీలేక ఆక్రమణలకు గురవుతుంది. కళాశాల స్థలం నుంచి ఇటీవల 22.5 ఎకరాలను జవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించింది. కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసిన అధికారులు.. కళాశాలకు మిగిలిన స్థలాన్ని మాత్రం వదిలేశారు. ప్రస్తుతం ఉన్న స్థలానికి రక్షణ కల్పించాలని, కళాశాలకు అవసరమైన కంప్యూటర్లతో పాటు పూర్తిస్థాయి అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఎఫ్‌ఆర్‌సీతో ఆందోళన

డిగ్రీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌సీ (ఫేసియల్‌ రికగ్నైషన్‌ సిస్టమ్‌)ను తప్పని సరి చేసింది. దాంతో కళాశాల విద్యార్థులతో పాటు అధ్యాపకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంటివద్ద వ్యవసాయంతో పాటు వివిధ రకాల పనులు చేసుకుంటూ కళాశాలలకు వచ్చి చదువుకుంటున్నారు. ఎఫ్‌ఆర్‌సీ వల్ల ఉదయం, సాయంత్రం తప్పని సరిగ్గా కళాశాలకు రావాల్సి ఉంటుంది. 75 శాతం హాజరులేకపోతే పరీక్ష రాయడానికి, ఉపకార వేతనాలకు అనర్హులవుతారు. విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఇబ్బంది పడుతున్న డిగ్రీ కళాశాలపై ఎఫ్‌ఆర్‌సీ తీవ్ర ప్రభావం చూపుతుందని అధ్యాపకులు అంటున్నారు.

ఫ కోదాడ కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలలోని పీజీ కోర్సుల ఎత్తివేత

ఫ ఆ భవనంలో ‘టాస్క్‌’ కోసం ఇచ్చేందుకు అధికారుల యత్నాలు

ఫ 22 ఎకరాల స్థలం నవోదయకు అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement