డిసెంబర్‌లో పనులు పూర్తి చేస్తాం..
నడిగూడెం : మండలంలోని రామాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న రైతుల సాగునీటి కల నెరవేరనుంది. ఈ ప్రాంతానికి దగ్గరే సాగర్ ఎడమ కాల్వ ఉన్నా చుక్క నీరు అందని పరిస్థితి. దాంతో ఈ ప్రాంత రైతులు ఏళ్ల తరబడి వర్షాధార పంటనే సాగు చేస్తున్నారు. తమ ప్రాంతానికి సాగర్ నీటిని అందించాలనే వారి డిమాండ్ తీర్చేందుకు ప్రభుత్వం ఆర్–9 లిఫ్టు నుంచి ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణం చేపడుతోంది. ఇది పూర్తయితే ఈ ప్రాంతంలోని సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఏళ్లుగా ఎదురు చూపులు
నడిగూడెం మండలం రామాపురం రెవెన్యూ పరిధిలోని 190 సర్వే పరిధిలో సుమారు 2,600 ఎకరాల భూములున్నాయి. ఇందులో దాదాపు 600 ఎకరాలు గుట్టలు ఉండగా మిగతావి సాగు భూములు. ఇందులోంచి 300 ఎకరాలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 1,500 ఎకరాల భూములల్లో రైతులు వర్షాధార పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతం ఆర్–9 లిఫ్టు కింద ఉన్నా చివరి భూములకు సాగునీరు అందడం లేదు.
రూ.28 కోట్లతో పనులు
మునగాల మండలం కృష్ణానగర్ వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వ సమీపంలో ఉన్న ఆర్–9 లిఫ్టు నుంచి సుమారు 7.50 కిలోమీటర్ల వరకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందు కోసం కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి, రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషితో ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసింది. గతనెల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు.
నాణ్యతతో పనులు
ప్రత్యేక పైపులైన్ పనుల్లో భాగంగా కాల్వను తవ్వుతున్నారు. దాంతో పాటు ఇనుప పైపులు తుప్పు పట్టకుండా ఉండేలా వాటి చుట్టూ ఇనుప చువ్వలు ఏర్పాటు చేసి, సిమెంట్ పూతను వేస్తున్నారు. ఈ పైపులైన్ నిర్మాణం పూర్తయితే మునగాల మండలం కృష్ణానగర్, బరాఖత్‌గూడెం, ముకుందాపురం, ఆకుపాముల, కోదండరామాపురం గ్రామాలతో పాటు, నడిగూడెం మండలం రామాపురం, ఎకలాస్‌ఖాన్‌పేట తండా, తెల్లబల్లి గ్రామాలకు చెందిన రైతులకు సాగు నీరు అందనున్నది.
నడిగూడెం, మునగాల మండలాలకు చెందిన పలు గ్రామాలకు ఆర్–09 ఎత్తి పోతల పథకం ద్వారా ప్రత్యేక పైపులైన్ నిర్మాణపు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ వరకు పనులు పూర్తి చేస్తాం.
– రాంప్రసాద్, డీఈ, నీటి పారుదల శాఖ, నడిగూడెం సబ్ డివిజన్
ఫ ఆర్–09 ఎత్తి పోతల నుంచి
ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు
ఫ రూ.28 కోట్లతో కొనసాగుతున్న పనులు
ఫ 190 సర్వే నంబర్ పరిధిలోని భూములకు అందనున్న సాగునీరు


