మిర్యాలగూడ అర్బన్ : తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలుడిని ట్రాక్టర్ మృత్యువు రూపంలో వచ్చి కబలించింది. మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం బెట్టెతండా గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీను కుమారుడు చరణ్(11) మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత శ్రీను తన బైక్‌పై చరణ్‌ను తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా.. ఈదులగూడ బైపాస్ రోడ్డు వద్ద ధాన్యం లోడుతో వచ్చిన ట్రాక్టర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ రోడ్డు పక్కకు పడిపోగా.. ట్రాక్టర్ ట్రాలీ టైరు చరణ్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు శ్రీనును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.
రైలు ఢీకొని తెగిపడిన ప్రయాణికుడి కాలు
మిర్యాలగూడ అర్బన్ : రైలు పట్టాలు దాటుతుండగా జారి కిందపడిన వ్యక్తి కాలు పైనుంచి రైలు వెళ్లడంతో కాలు తెగిపడింది. ఈ ఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే ఏఎస్‌ఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురానికి చెందిన చేవూరి వెంకటాచారి గుంటూరుకు వెళ్లేందుకు గాను ఆదివారం అర్ధరాత్రి మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం పైకి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా.. అదే సమయంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ నల్లగొండ నుంచి వస్తోంది. రెండో ప్లాట్‌ఫాం వద్ద ఉన్న వెంకటాచారి రైలు వేగాన్ని గమనించకుండా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించి జారిపడ్డాడు. దీంతో అతని ఎడమకాలు పైనుంచి రైలు వెళ్లడంతో పాదం వరకు తెగిపడింది. స్థానికులు గమనించి 108 వాహనంలో అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఏఎస్‌ఐ తెలిపారు.


