గరిడేపల్లి : రైతులు పంటల సాగులో రసాయన మందులు వాడటంతో ఖర్చులు పెరగడం, నేల సారం తగ్గిపోవడం, పంటలలో అవశేషాలు మిగలడం, పర్యావరణ కాలుష్యం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వనరులతో అనేక కషాయాలు తయారు చేసుకుని ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని గడ్డిపల్లి కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త డి. ఆదర్శ్ సూచిస్తున్నారు. రైతులే స్వయంగా తయారు చేసుకునే వివిధ రకాల కషాయాల గురించి ఆయన మాటల్లోనే..
● వేప ఆకుల కషాయం : దీని తయారీ కోసం 5 కిలోల వేప ఆకులు, 10 లీటర్ల నీరు 24 గంటలు నీటిలో నానబెట్టి, మరిగించి వడకట్టాలి. వడకట్టిన కషాయాన్ని వరి, కూరగాయ పంటలపై పిచికారీ చేయడం వలన ఆకు తినే పురుగు, రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇది పంటకు హాని చేయదు. ఖర్చు తక్కువ.
● దశపర్ణి కషాయం : 10 రకాల ఆకులు, 200 లీటర్ల నీరు, 2 నుంచి 3 లీటర్ల గోమూత్రం కలిపి 20–25 రోజులు నానబెట్టి వడకట్టాలి. ఈ కషాయాన్ని వివిధ రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు ఉపయోగించుకోవచ్చు.
● మిరప, వెల్లుల్లి కషాయం : 500 గ్రాముల ఎండు మిరప, 250 గ్రాముల వెల్లుల్లిని నూరి నీటిలో 24 గంటలు ఉంచాలి. ఈ కషాయం పంటలపై పిచికారీ చేస్తే వేగంగా ఫలితం ఉంటుంది.
● గోమూత్ర, వేప కషాయం : 5 లీటర్ల గోమూత్రం, 5 లీటర్ల నీరు, కొన్ని వేప ఆకులు కలిపి 7 రోజులు నానబెట్టాలి. ఈ కషాయాన్ని ఫంగస్, తెగుళ్ల నివారణకు ఉపయోగించవచ్చు. పంట రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
● అల్లం–వెల్లుల్లి, మిరప కషాయం : అల్లం 250 గ్రాములు, వెల్లుల్లి 250 గ్రాములు, మిరప 250 గ్రాములు నూరి 24 గంటలు నీటిలో ఉంచాలి. ఈ కషాయం అన్నిరకాల రసం పీల్చే పురుగులను నాశనం చేస్తుంది.
ఠి ఆవు పేడ ఆధారిత కషాయం : ఆవు పేడ 5 కిలోలు, నీరు కలిపి కొన్ని రోజులు పూతపోసి వడకట్టాలి. ఈ కషాయం పిచికారీ చేయడం వలన నేలలోని తెగుళ్లు నశించి, నేల సారవంతమవుతుంది.
● నీమాస్త్రం : వేప ఆకులు, గింజలు 5కిలోలు, ఆవు పేడ 5 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, నీరు 100 లీటర్లు కలిపి 24 నుంచి 48 గంటలు పూతపోసి వడకట్టి స్ప్రే చేయాలి. వరి, పత్తి, కూరగాయల పంటల్లో తెల్ల దోమ, ఆకుతినే పురుగులు, చిన్న పురుగులు నశిస్తాయి.
● బ్రహ్మస్త్రం : వేప, రావి, బిల్వ, తులసి, సీతాఫలం వంటి 5 నుంచి 7 రకాల చేదు ఆకులు మొత్తం 10కిలోలు తీసుకుని 10 లీటర్ల ఆవు మూత్రంతో కలిసి 2 నుంచి 3 రోజులు పూతపోసి మరిగించి చల్లారిన తర్వాత వడకట్టాలి. ఈ కషాయాన్ని కాండం తొలిచే పురుగును నివారిస్తుంది.
● అగ్నియాస్త్రం : ఎండు మిరప కిలో, వెల్లుల్లి 500 గ్రాములు, పొగాకు 500 గ్రాములు, ఆవు మూత్రం 10 లీటర్లు, నీరు 100 లీటర్లు కలిపి 24 గంటలు పూతపోసి వడకట్టి ఉపయోగించాలి. తెల్లదోమ, ఆకులపై ఆశించే పురుగులను ఈ కషాయం నాశనం చేస్తుంది.
జీవామృతం : ఆవు పేడ 10కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, శనగపిండి, పప్పు పిండి 2 కిలోలు, నీరు 200 లీటర్లు కలిపి 48గంటలు పూతపోసి నేలలో లేదా స్ప్రే రూపంలో ఉపయోగించాలి. ఈ కషాయం వలన నేల ఆరోగ్యం మెరుగుపడి సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. పంట ఎదుగుదల వేగంగా ఉంటుంది.
ఘన జీవామృతం : ఆవు పేడ 100 కిలోలు, ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు కలిపి ఎండబెట్టి గుళికలుగా తయారు చేయాలి. విత్తే ముందు లేదా నాటే సమయంలో నేలలో వేసుకోవచ్చు. దీని వలన నేల సారవంతం పెరుగుతుంది. వరి, ఇతర పంటలలో పురుగులు, తెగుళ్ల నియంత్రణకు ఈ కషాయాలు ఉపయోగపడతాయి.
గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త ఆదర్శ్ సూచనలు


