‘టీ–ఫైబర్‌’ కనెక్షన్‌ ఏదీ..? | - | Sakshi
Sakshi News home page

‘టీ–ఫైబర్‌’ కనెక్షన్‌ ఏదీ..?

Mar 24 2026 6:53 AM | Updated on Mar 24 2026 6:53 AM

రామన్నపేట : అతి తక్కువ ఖర్చుతో ప్రతి పల్లెకూ హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ–ఫైబర్‌ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ఒకే కనెక్షన్‌ ద్వారా ఫోన్‌, ఇంటర్‌నెట్‌, ఓటీటీ, టీవీ సేవలను అందించాలని రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నేటికీ క్షేత్రస్థాయిలో కనెక్షన్లు ఇవ్వకపోవడంతో టీ–ఫైబర్‌ సేవలు పల్లె ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.

టీ–ఫైబర్‌నెట్‌ గ్రిడ్‌తో ప్రయోజనాలు

భారత్‌ నెట్‌ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

మల్టీపర్పస్‌ కనెక్షన్‌ : ఒకే కనెక్షన్‌తో ఫోన్‌, ఇంటర్‌నెట్‌, టీవీ మరియు ఓటీటీ సేవలు పొందవచ్చు.

స్మార్ట్‌ టీవీగా మార్పు : ప్రత్యేక సెటాప్‌బాక్స్‌ ద్వారా సాధారణ టీవీలను కూడా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. కీబోర్డు, మౌస్‌ ఉంటే చాలు, ప్రత్యేకంగా కంప్యూటర్‌ కొనాల్సిన పనిలేదు.

విద్యా సేవలు : విద్యార్థులు తమ ఐడీల ద్వారా గూగుల్‌ క్లాస్‌లు వినడం, హోంవర్క్‌ చేయడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు.

వేగవంతమైన ఇంటర్‌నెట్‌ : ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వాడటంతో ఇంటర్నెట్‌ వేగం ఎక్కువగా ఉంటుంది.

భూగర్భ కేబుల్‌ వేసినా..

జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి దశ కింద రెండేళ్ల క్రితమే లక్షలు ఖర్చు చేసి టీ–ఫైబర్‌ సెట్లను అమర్చారు. వీటికి విద్యుత్‌ సరఫరా కోసం ఖరీదైన సోలార్‌ ప్యానళ్లను కూడా బిగించారు. భూగర్భ కేబుళ్లు వేసి పాఠశాలలు, అంగన్‌వాడీలు, పీహెచ్‌సీలకు అనుసంధానం చేసినా ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు.

ప్రస్తుత పరిస్థితి ఇలా..

కొన్నిచోట్ల రైతు వేదికలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో పరికరాలన్నీ దుమ్ము పట్టిపోతున్నాయి. సిరిపురం వంటి గ్రామాల్లో ఇవి కేవలం అలంకారప్రాయంగా మారాయి.

పేపర్‌ లెస్‌ సేవలకు ఆటంకం

టీ–ఫైబర్‌ కనెక్షన్లు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో, పంచాయతీల్లో కాగితరహిత (పేపర్‌ లెస్‌) పాలన సాధ్యమవుతుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా పనులు త్వరగా పూర్తవుతాయి. ఏప్రిల్‌ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ, ఈ సేవలు ఎప్పుడు అందుతాయనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని సంబంధిత ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

పరికరాలు అమర్చి రెండేళ్లు

అలంకారప్రాయంగా సోలార్‌ ప్యానళ్లు

పంచాయతీల్లో ఇంటర్‌నెట్‌

సేవలకు తప్పని నిరీక్షణ

ప్రభుత్వ కార్యాలయాలకూ

కనెక్షన్లు శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement