అన్నదాతపై వరికోతల భారం
ఆర్థికభారం పడుతుంది
నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు పొందాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : మోంథా తుపాను అన్నదాతను ఆగం చేసింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కారణంగా ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దవుతుండగా..మరోవైపు కోతకొచ్చిన వరిపొలాల్లోకి నీరుచేరి నేలవాలాయి. నీటిలోనే మునిగిఉన్న వరిపంటను కోయించాలంటే రైతులు టైర్ హార్వెస్టర్లకు బదులు చైన్ హార్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో చైన్ హార్వెస్టర్లకు డిమాండ్ పెరింది. ఫలితంగా వాటి యజమానులు వరికోత ధరలు పెంచారు. గతంలో చైన్ హార్వెస్టర్‌తో ఎకరం వరిపొలం కోసేందుకు గంట సమయం పట్టేది. ఇందుకు రూ.3 వేలు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం గంటకు రూ.3,500 వరకు వసూలు చేస్తుండడానికితోడు పొలాల్లో బురద ఉండడంతో ఎకరా వరిపంటను కోసేందుకు రెండు గంటలు పడుతుంది. అయితే టైర్ల హార్వెస్టర్‌కు గంటకు రూ.1,800 నుంచి రూ.2వేలు, ఫోర్‌వీల్ హార్వెస్టర్‌కు గంటకు రూ.3వేలు వేలు కాగా, చైన్ హార్వెస్టర్‌కు గంటకు రూ.3,500 వసూలు చేస్తున్నారు. దీంతో వరికోత ఖర్చు రెండింతలు పెరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
4.65 లక్షల ఎకరాల్లో వరిసాగు
జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 4,65,163 ఎకరాల్లో రైతులు వరిపంట సాగుచేశారు. ప్రస్తుతం 50 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తికాగా 2లక్షల ఎకరాలు కోసేందుకు సిద్ధంగా ఉంది. మిగతా పొలాలు పొట్టదశలో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో దాదాపు అన్ని మండలాల్లో సగానికిపైగా వరిపంట నేలకొరిగింది. దీంతో కేవలం చైన్ హార్వెస్టర్లతోనే కోస్తున్నారు.
ఎకరానికి 2 గంటల సమయం
సాధారణంగా ఎకరం వరిపంటను చైన్ హార్వెస్టర్ గంట సేపు కోస్తుంది. వర్షాలతో పొలాల్లో బుదర ఉండి వరి నేలవాలాయి. దీంతో ప్రస్తుతం ఎకరం వరిపొలం కోసేందుకు 2 గంటలకు మించి సమయం పడుతుంది. దీంతో ఎకరాకు రూ.5 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం పొలాల్లో బురద ఉండటంతో ట్రాక్టర్లు పొలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో చైన్ హార్వెస్టర్లు వరి పంటను కోసిన అనంతరం దూరంగా ఉన్న ట్రాక్టర్ వద్దకు వెళ్లి ధాన్యం పోసి మళ్లీ వెనక్కి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది.
ఫ మోంథా తుపానుతో
కురుస్తున్న వర్షం
ఫ నీళ్లు చేరి నేలవాలిన వరిపొలాలు
ఫ చైన్ హార్వెస్టర్‌తోనే
కోసేందుకు అవకాశం
ఫ గంటకు రూ.3,500 వసూలు చేస్తున్న యజమానులు
ఫ ఎకరాకు అదనంగా రూ.5వేలు చెల్లిస్తున్న రైతులు
తుపాను ప్రభావంతో పొలాలన్నీ బురదగా మారాయి. దీంతో చైన్ హార్వెస్టర్లలో పొలాలను కోపిస్తున్నాం. గంటకు రూ.3,500 చెల్లించాల్సి వస్తుంది. 8 ఎకరాల్లో వరిపంట కోసేందుకు 17 గంటల సమయం పట్టింది. ఈసారి కోతల భారం పెరిగింది.
– రామారావు, తొండ, తిరుమలగిరి మండలం
తుపాను కారణంగా అంతటా వడ్లు తడిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వరికోతలు పూర్తయిన రైతులు ధాన్యం తడవకుండా భద్రపర్చుకోవాలి. కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
అన్నదాతపై వరికోతల భారం


