100 రోజులు.. 35 టీఎంసీలు
కేతేపల్లి: ఈ ఏడాది జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు దాదాపు 39 టీఎంసీల వరద నీరు ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో విడతల వారీగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు కింద 35వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
సీజన్ ప్రారంభంలోనే నిండిన మూసీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుకు జిల్లాతో పాటుగా వికారాబాద్, హైదరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలో క్యాచ్‌మెంట్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో ఈ సారి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతంగా సాగుతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభంలోనే మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. మూసీలో గరిష్ట నీటిమమట్టం 645 అడుగులు కాగా జూలై మాసంలోనే 644 అడుగులకు చేరుకుంది. దీంతో ఈ ఏడాది జూలై 25న మొదటి సారి గేట్లు ఎత్తి నీటిని దిగవకు వదిలారు. దీంతోపాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని 42 గ్రామాల్లో వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. నాటి నుంచి వర్షాలు కురుస్తున్న కారణంగా వరదనీరు వస్తుండడంతో నేటికీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతూనే ఉంది.
తొమ్మిది రెట్ల వరద దిగువకు..
మూసీ జలాశయంలో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా గేట్లు ఎత్తడంతో గత 100 రోజుల వ్యవధిలో దాదాపు 35 టీఎంసీల నీరు దిగువన కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకు చేరింది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం కంటే 9 రెట్ల వరదనీరు దిగువకు వెళ్లింది. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ఈ లెక్కన 35 టీఎంసీలతో 3.5లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చు. దీన్నిబట్టి చూస్తే మూసీ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది వరదనీరు సముద్రం పాలయ్యయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వానాకాలం సాగు పంటకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసిన తర్వాత కూడా ప్రాజెక్టు నిండు కుండలా ఉంది. దీంతో యాసంగి సీజన్‌లోనూ నీటి విడుదల ఎలాంటి ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫ మూసీ ప్రాజెక్టు నుంచి
దిగువకు వెళ్లిన నీరు
ఫ ఈసారి జూలైలోనే క్రస్ట్‌గేట్ల ఎత్తివేత
ఫ ఇంకా కొనసాగుతున్న వరద,
నీటి విడుదల


