నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట డివిజన్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు సూర్యాపేటలోని జమ్మిగడ్డలో ఉన్న సర్కిల్ ఆఫీస్ థర్డ్ ఫ్లోర్‌లో విద్యుత్ వినియోగదాల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా విద్యుత్ అధికారి బి.ఫ్రాంక్లిన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే సమావేశంలో విద్యుత్ వినియోదారుల హక్కుల గురించి తెలియజేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే వినతులు అందజేయాలని తెలిపారు. అధి కారులు స్పందించకపోతే ఈ సమావేశంలో నేరుగా చెప్పవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులంతా వినియోగించుకోవాలని కోరారు.
వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం
హుజూర్‌నగర్: మఠంపల్లి మండలం మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం గావించారు. స్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలతో నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి మహా నివేదన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలు మరువలేనివి
కోదాడరూరల్ : సమాజ మార్పు కోసం అమరులైన వారి త్యాగాలు మరువలేనివని అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన అమరువీరుల వారోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్లవోద్యమంలో అసువులుబాసిన అమరులకు నివాళులర్పించి మాట్లాడారు. విప్లవోద్యమంలో ప్రతిఘటన పోరాట నిర్మాత చండ్ర పుల్లారెడ్డి లాంటి అనేక మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దెల జానయ్య, కామల్ల సైదులు, మద్దెల ప్రతాప్, భిక్షం, వెంకన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం


