
ఆరు మండలాల్లో ఎంపీడీఓలు లేరు!
నాగారం : జిల్లాలోని ఆరు మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓలు) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. గ్రామీణ వ్యవస్థలో కీలకమైన ఎంపీడీఓలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వచ్చే స్థానిక ఎన్నికల నేపథ్యంలో పాలనాపరంగా సమస్యలు రావొచ్చనే చర్చ మొదలైంది. ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ మొదలు ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో అర్హులైన వారి దరిచేర్చడంలో ఎంపీడీఓలదే ముఖ్య భూమిక పోషిస్తారు. ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో గ్రామాల్లో అంటురోగాలు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చక్కదిద్దడం వంటి పనులు కూడా ఎంపీడీఓలే చూడాల్సి ఉంటుంది. దీనికితోడు ఎంపీడీఓ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా కేటాయించే ఉపాధి పనులు, ఇతర అభివృద్ధి పనుల పూర్తి పర్యవేక్షణ వీరిపైనే ఉంటుంది.
ఎన్నికల విధుల్లో కీలకపాత్ర
ఎన్నికల విధుల్లో ఎంపీడీఓలు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో భాగంగా ఇటీవల గ్రామ పంచాయతీ, ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. మ్యాప్‌ల తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వచ్చిన ఎన్నికల సామగ్రి సిద్ధం చేయడం వంటి పనులన్నీ ఎంపీడీఓలే దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన అనంతరం ఈ పనిభారం మరింత పెరగనుంది. సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్ల కేటాయింపులు, నామినేషన్ పత్రాల స్వీకరణ వంటి అంశాల్లో పైఅధికారులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నికల నిర్వహణ విధుల్లో సమర్థవంతమైన పాత్ర పోషిస్తారు.
త్వరలోనే భర్తీ అవుతాయి
జిల్లాలో 23 మండలాలకు గాను 15 మంది ఎంపీడీఓలు రెగ్యులర్ వాళ్లు పనిచేస్తున్నారు. మరో ఆరు మండలాల్లో ఇన్‌చార్జ్‌లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. తర్వరలోనే రెగ్యులర్ ఎంపీడీఓలు వచ్చే అవకాశం ఉంది.
– వీవీ.అప్పారావు, జెడ్పీ సీఈఓ, సూర్యాపేట
ఫ 23 మండలాలకు
15 చోట్లనే రెగ్యులర్ ఎంపీడీఓలు
ఫ రెండుచోట్ల బాధ్యతలు
స్వీకరించాల్సి ఉన్న కొత్తవారు
ఫ మిగతా మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలనే
ఫ అదనపు బాధ్యతలతో
ఎంపీఓలకు తప్పని ఇక్కట్లు

ఆరు మండలాల్లో ఎంపీడీఓలు లేరు!