
హాస్టల్ వార్డెన్లు స్థానికంగా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : హాస్టల్ సంక్షేమ అధికారులు స్థానికంగా నివాసం ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది తీసుకున్న చర్యల వల్ల మెరుగైన ఫలితాలు సాధించామని, తద్వారా ఈసారి హాస్టల్స్‌లో అడ్మిషన్లు పెరిగాయన్నారు. సంక్షేమ హాస్టల్స్ అంటే వసతి కాదని, చదువుకోవడానికి ప్రభుత్వం కల్పించిన విద్యా మందిరం అన్నారు. ప్రతి హాస్టల్ సంక్షేమ అధికారి స్టాక్ రిజిస్టర్‌తోపాటు అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, సమయపాలన పాటించాలన్నారు. బాలికల హాస్టల్‌లో శానిటేషన్ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారులు దయానందరాణి, శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, హాస్టల్ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు
జరిగేలా చూడాలి
అనంతరం జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రామ్‌పై వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలోనే కాకుండా కోదాడ, హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లోనూ ప్రసవాలు చేయాలన్నారు. సాధారణ ప్రసావాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ జయ మనోహరి, జి.చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు కోటి రత్నం, నాజియా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్