
రానున్నది డబుల్ ఇంజన్ సర్కార్
సూర్యాపేట : రాష్ట్రంలో రానున్నది డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు సహకరిస్తారని అన్నారు. గతంలో ఈ జిల్లాలో సైకిళ్లపై తిరిగి రెండు మూడు సభ్యత్వాలు చేయడానికి ఎంతో కష్టపడ్డామన్నారు. నేడు లక్షకు పైగా సభ్యత్వాలు నమోదుకావడం శుభసూచకమని పార్టీ అధికారంలోకి రావడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. అర్హులకు రేషన్‌కార్డులు అందడంలేదని కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఇదే కొనసాగితే దీనిపై ఉద్యమం చేస్తామన్నారు. రేషన్ కార్డ్‌పై నరేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించాలన్నారు. పదేళ్ల కాలంలో రూ.10 లక్షల కోట్లకు పైచిలుకు నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇస్తామన్న ఆరు గ్యారంటీలు అటకెక్కాయని, హామీలు నెరవేర్చకపోతే ప్రజలు గద్దె దింపడం ఖాయమని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో
ఒంటరిగానే పోటీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు ఒంటరిగానే పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుస్తామని రాంచందర్‌రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని బీసీలను మోసం చేస్తోందన్నారు. అందులో 10 శాతం ముస్లింలకుకేటాయించడం విడ్డూరమన్నారు. 42శాతం పూర్తిగా బీసీలకు కేటాయిస్తే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీఈ లో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్యను తమ పార్టీకి అంటగట్టి రాంచందర్‌రావును బదనాం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్మశానంలో పేలాలు ఏరుకుంటోందని విమర్శించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం, పట్టుదల పెరిగిందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ నేత కడియం రామచంద్రయ్య, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా నాయకులు సలిగంటి వీరేందర్, నరసింహ పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు