
సాగర్ నీటి విడుదలపై సందిగ్ధం!
నాగార్జునసాగర్ : సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేందుకు నేటికి ముహూర్తం ఖరారు కాలేదు. ఈ యేడాది కృష్ణానదికి ముందస్తుగానే వరద రావడంతో అదనంగా వచ్చే నీరంతా నాగార్జునసాగర్ జలాశయానికే వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు (312.0450 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 554.00 అడుగులు (218.6760 టీఎంసీలు)గా ఉంది. మరో 94 టీఎంసీల నీరు వచ్చి చేరితే జలాశయం గరిష్టస్థాయికి చేరుకుంటుంది. ఈ ఏడాది జూన్ మాసంలో సాగర్ జలాశయం 511.60అడుగులు (134.4032 టీఎంసీలు)గా ఉంది. ఇప్పటివరకు 84 టీఎంసీల నీరు వచ్చి చేరింది. గత ఏడాది సాగర్ జలాశయంలో 528.00 అడుగుల నీరున్నప్పుడే కాల్వలకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 554 అడుగుల నీరుంది. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. అయితే ఎగువనుంచి వస్తున్న వరదను పరిశీలిస్తూ ఈ నెల 20వ తేదీ వరకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో 3,98,790 ఎకరాల ఆయకట్టు
సాగర్ ఎడమ కాల్వకింద నల్లగొండ, సూర్యాటపేట జిల్లాల్లో 51 మేజర్ల కింద 3,98,790 ఎకరాల ఆయకట్టు ఉంది. 47 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు కూడా సరిగా లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. సాగరకు ఎగువ నుంచి వరద వస్తున్నందున వెంటనే నీటిని విడుదల చేస్తే నార్లు పోసుకునే అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. వర్షాకాలం ఇంకా మూడు నెలల 15 రోజులు ఉంది.. ఒక వేళ వరద పెరిగితే.. నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై నా ఆలోచించి వెంటనే నీటిని విడుదల చేయాలని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులు కోరుతున్నారు.
సమావేశం వాయిదా..
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, నీటి విడుదలపై నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ, సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఉండడంతో ఆ సమావేశం వాయిదా పడినట్లు తెలిసింది.
ఫ ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన
ఫ ఎదురుచూపుల్లో ఆయకట్టు రైతులు
శ్రీశైలం నుంచి ఒక్క గేటు ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్: శ్రీశైలం జలాశయం నుంచి ఒక రేడియల్ క్రస్ట్ గేటు 10అడుగులు ఎత్తి స్పిల్‌వే మీదుగా 27,065 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,339 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం సాగర్ జలాశయానికి 95,404 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.