
మొన్న సన్న బియ్యం.. నేడు రేషన్ కార్డులు
సీఎం టూర్ షెడ్యూల్
● మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరుతారు.
● 2.15 గంటలకు రామోజీ ఫిలింసిటీకి చేరుకుంటారు.
● 2:30 గంటల నుంచి 3:30 గంటల వరకు అక్కడ శ్రీమద్‌భాగవతం సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారు.
● 3:30 గంటలకు అక్కడనుంచి బయలుదేరి 4 గంటలకు తిరుమలగిరికి చేరుకుంటారు.
● 4:15 గంటలనుంచి 5:10 గంటల వరకు తిరుమలగిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.
● 5:10 గంటల నుంచి 5:30 గంటల వరకు లబ్ధిదారులకు ఆహార భద్రత (రేషన్) కార్డులను పంపిణీ చేస్తారు.
● 5:30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 6 గంటలకు బేగంపేట ఎర్‌పోర్టుకు చేరుకుని జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళతారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజా సంక్షేమంలో కీలకమైన పథకాల అమలులో ఉమ్మడి నల్లగొండ జిల్లా వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా హు జూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్‌కార్డుల పంపిణీకి కూడా ఆయనే శ్రీకారం చుట్టనున్నారు. నిరుపేద కుటుంబాలకు ఆహారభద్రత కల్పించే ముఖ్యమైన రెండు పథకాల అమలుకు ఉమ్మడి నల్లగొండనే కేంద్ర బిందువు కావడం విశేషం.
నెరవేరబోతున్న పేదల కల
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు అందిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా దరఖాస్తులు స్వీకరించింది. వాటిని పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కల నెరవేరబోతోంది. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీని ప్రారంభించిన తరువాత జిల్లాల్లో ప్రజాప్రతినిధుల ద్వారా కార్డులు పంపిణీ చేస్తారు.
మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అయినందున సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో కార్యక్రమం ప్రారంభించేలా సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించారు. అవసరమైన ఏర్పాట్లను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. గతంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కూడా తన సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్ నుంచే ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రం నుంచి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. రెండు కీలకమైన పథకాలు మన జిల్లా నుంచే ప్రారంభం కావడం జిల్లాకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.
10,57,863 మందికి లబ్ధి
సూర్యాపేట జిల్లాలో 3,26,057 పాత కార్డులు ఉండగా, ఇప్పుడు 23,870 కొత్త కార్డులు రాబోతున్నాయి. జిల్లాలో మొత్తంగా 3,49,927 కార్డుల ద్వారా 10,57,863 మందికి లబ్ధి చేకూరనుంది.
సంక్షేమంలో రెండు కీలక పథకాల అమలు మన దగ్గరి నుంచే..
ఫ ఉమ్మడి జిల్లాకు దక్కిన ప్రాధాన్యం
ఫ నేడు తిరుమలగిరి సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ

మొన్న సన్న బియ్యం.. నేడు రేషన్ కార్డులు