గురుకులాల్లో ఎందుకిలా..? | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో ఎందుకిలా..?

Jul 16 2025 3:21 AM | Updated on Jul 16 2025 3:21 AM

గురుక

గురుకులాల్లో ఎందుకిలా..?

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

డీఈఓ అడ్డగింత

సూర్యాపేటటౌన్‌ : నడిగూడెం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఉరేసుకొని మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి మంగళవారం ఉదయం తీసుకొచ్చారు. అయితే పోస్టుమార్టం వద్దకు వచ్చిన డీఈఓ అశోక్‌ను విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఎలాంటి విచారణ చేయకుండా కుటుంబ తగాదాలతో మృతి చెందిందని మీడియాకు ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు. పోలీసులు చేయాల్సిన విచారణను డీఈఓ ఎలా చేస్తారని నిలదీశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పోస్టుమార్టం గది వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సముదాయించడంతో డీఈఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఫుడ్‌ పాయిజన్‌తో పలువురు ఆస్పత్రి పాలు

పట్టింపులేని సిబ్బంది, అందుబాటులో ఉండని ప్రిన్సిపాళ్లు

కనిపించని ఉన్నతాధికారుల పర్యవేక్షణ

వరుస సంఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంధ్య(11) పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, అదే రోజు దేవరకొండలోని ఆశ్రమ పాఠశాలలో 40 మంది, మర్రిగూడలోని మోడల్‌ స్కూల్‌లోని బాలికల హాస్టల్‌లో 18 మంది విద్యార్థినులు ఫుడ్‌పాయిజన్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ఇవే కాకుండా మంగళవారం తెలవారుజామున నడిగూడెంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనూష మహాలక్ష్మి క్లాస్‌రూమ్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో గురుకులాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే తమ పిల్లల బాగోగులపై ఆందోళన చెందుతున్నారు.

సిబ్బంది నిర్లక్ష్యం,

పర్యవేక్షణ లోపమే కారణమా?

తూప్రాన్‌పేట బీసీ గురుకుల పాఠశాలలో సంధ్య ఆత్మహత్య చేసుకోవడం వెనుక సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతోపాటు భద్రతపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసింది. నాలుగంతస్తులు ఉన్న ఆ భవనంపైకి వెళ్లేందుకు ఉన్న మెట్ల వద్ద కనీసం గేటు కూడా లేకపోవడంతోనే ఆ బాలిక భవనంపైకి కిందకి దూకినట్లు అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. వందల మంది విద్యార్థులు ఉండే గురుకులాల్లో, అందులోనూ బాలికల గురుకులాల్లో కనీస భద్రత చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాత్రి వేళలలో పర్యవేక్షించాల్సిన సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం వల్లే ఆ సంఘటన జరిగినట్లు తెలిసింది. డ్యూటీల సమయంలో మెళకువతో ఉండాల్సి ఉన్నా వారు నిద్రపోవడం వల్లే బాలిక భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు సమాచారం. ఇక నడిగూడెం కేజీబీవీలో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఇదే పరిస్థితి నెలకొంది. పైగా తరగతి గదికి తాళం వేయలేదని, దాంతో బాలిక తరగతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, వార్డెన్లు సరిగ్గా పట్టించుకోకపోవడం, అందుబాటులో ఉండకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నాణ్యత లేని భోజనంతో ఆసుపత్రులపాలు

గురుకులాలతోపాటు సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపం, అందుబాటులో ఉండకపోవడం, భోజనం నాణ్యతను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. దేవరకొండ, మర్రిగూడ పాఠశాలల్లో ఈ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో భోజనం నాణ్యతను పట్టించుకునే వారే లేరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు మండల కేంద్రంలో విద్యార్థులకు వండి పెడుతున్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని పలుమార్లు హాస్టల్‌ తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే, జిల్లా అధికారులకు విద్యార్థులు మొర పెట్టుకున్నారు. అయినా భోజనంలో మార్పు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా అంతటా ఉంది.

గురుకులాల్లో ఎందుకిలా..?1
1/1

గురుకులాల్లో ఎందుకిలా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement