
మధ్యాహ్న భోజన బిల్లులేవి !
ఫ మూడు నెలలుగా అందని బిల్లులు
ఫ సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న వంట ఏజెన్సీలు
నాగారం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలల నుంచి బిల్లులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఆర్థిక భారంగా మారడంతో వంట చేయలేమని పేర్కొంటున్నారు.
సరుకుల కొనుగోళ్ల భారం
జిల్లాలో 874 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 40,447 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో 1437 మంది వంట ఏజెన్సీలున్నాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ.6.19, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ.9.29, కోడిగుడ్డుకు రూ.6, 9వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థికి కోడిగుడ్డుతో కలుపుకొని రూ.10.67 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండగా కూరగాయలు, వంట నూనె, గ్యాస్, నిత్యావసర సరుకులు ఏజెన్సీ నిర్వాహకులు దుకాణాల్లో కొనుగోలు చేసి వంట చేయాలి. కానీ మార్చి నుంచి జూన్ వరకు బిల్లులు రాలేదు. కోడిగుడ్ల బిల్లులు సైతం రాకపోవడంతో ఆర్థికంగా భారమవుతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గౌరవ వేతనం సైతం..
జిల్లాలో 1437 మంది మధ్యాహ్న భోజనం వండే కార్మికులు ఉన్నారు. వీరికి గౌరవ వేతనంగా కేంద్ర ప్రభుత్వం రూ.1000, రాష్ట్ర ప్రభుత్వం రూ.2000 కలిపి మొత్తం రూ.3000 చెల్లిస్తుంది. గౌరవ వేతనం కూడా రావడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు వాపోతున్నారు. వంట బిల్లులు రాక కిరాణషాపులు, కూరగాయల దుకాణాల్లో ఉద్దెర పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలు – 874
విద్యార్థులు – 40,447
వంట కార్మికులు – 1437
అప్పు తెచ్చి వండి పెడుతున్నాం
మధ్యాహ్న భోజన బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పు తెచ్చి మరీ వండి పెడుతున్నాం. ప్రస్తుతం పెరిగిన ధరలతో ఆర్థికంగా భారమవుతోంది. గుడ్డుకు రూ.6లు చెల్లిస్తుండగా, మేము రూ.7లకు కొనుగోలు చేసి పెడుతున్నాం. గుడ్ల బిల్లులతో పాటు, మార్చి, ఏప్రిల్, జూన్ మూడు నెలల వంట బిల్లులు రాలేదు. ప్రభుత్వం వంట బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలి.
– తోట జయమ్మ, మధ్యాహ్న భోజన
నిర్వాహకురాలు, వర్థమానుకోట

మధ్యాహ్న భోజన బిల్లులేవి !