
ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దు
కోదాడ: జిల్లాలో దుకాణదారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం కోదాడలో ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు. దుకాణదారులు ఎరువులను ఈ పాస్ మిషన్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మాలని, వ్యవసాయశాఖ అధికారులు దీనిని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.
గైనకాలజిస్ట్ విధులకు
డుమ్మాకొట్టడంపై ఆగ్రహం
కలెక్టర్ కోదాడలోని ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి గైనకాలజిస్ట్ పద్మావతి విధులకు డుమ్మా కొట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ప్రభుత్వ వైద్యశాలను గతంలో తనిఖీ చేసిన సమయంలో గైనకాలిజిస్ట్ విధులకు హాజరు కాలేదు... మళ్లీ ఈ రోజు కూడా ఆమె డ్యూటీకి రాలేదు ఎందుకు.? దీనిపై వెంటనే నాకు నివేదిక ఇవ్వండి’ అని కలెక్టర్.. వైద్యశాల సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. 100 పడకల వైద్యశాల నిర్మాణ పనులను పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తిచేయాలని కోరారు.
నాణ్యమైన విద్యనందించాలి
కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ సూచించారు. బాలుర పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న భవనాలను వెంటనే పూర్తి చేయాలని, విద్యార్థులకు అవసరమైన వసతులను మెరుగు పర్చాలని కోరారు. బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ల నిర్మాణం చేయాలని దానికి వెంటనే రూ.7 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే పాఠశాలలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, వైద్యశాల సూపరింటెండెంట్ దశరథనాయక్, కమిషనర్ రమాదేవి, మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దు