మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు! | - | Sakshi
Sakshi News home page

మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు!

Jul 16 2025 3:21 AM | Updated on Jul 16 2025 3:21 AM

మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు!

మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు!

భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగనుంది. రిజర్వేషన్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ను తొలగించేందుకు త్వరలోనే ఆర్డినెన్స్‌ రానుంది. ఈ ఆర్డినెన్స్‌ రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. అయితే మండలం యూనిట్‌గా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉండనున్నాయి. సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాలకు ఈ ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించనున్నారు.

బీసీలకు 42శాతం..

బీసీలకు 42శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7 శాతంతో పాటు అన్ని కేటగిరీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం అమలు చేయనుంది. ఆర్డినెన్స్‌ విడుదలైన వెంటనే పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ద్వారా రిజర్వేషన్ల కోటా, కేటాయింపులకు ఉత్తర్వులు రానున్నాయి. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే కలెక్టర్లు, ఆర్డీఓల నేతృత్వంలో రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటిస్తారు. జిల్లా పరిషత్‌ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ పదవులకు జిల్లా యూనిట్‌గా, సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యుల పదవులకు మండలం యూనిట్‌గా, గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు గ్రామం యూనిట్‌గా రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై ఎటూ తేలకపోవడంతో ఇన్నాళ్లూ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఆర్డినెన్స్‌ ద్వారా బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోగా పరిషత్‌లకు, పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారైతే ఆగస్టులో తొలుత పరిషత్‌ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామపంచాయతీల ఎన్నికలు జరుగుతాయని అధికార, రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫ నెలాఖరులోగా ఖరారు చేసే అవకాశం

ఫ తొలుత పరిషత్‌లు, ఆ తర్వాత

పంచాయతీలకు కేటాయింపు

ఫ రిజర్వేషన్లపైనే నాయకుల ఆశలు

ఆశావహుల ఎదురుచూపులు

జిల్లాలో గత ఎన్నికల సమయంలో ఉన్న రిజర్వేషన్లు కాకుండా కొత్తవి రానున్న నేపథ్యంలో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పోటీకి సిద్ధంగా ఉన్నా.. ఇన్నాళ్లూ రిజర్వేషన్‌ తమది కాదని భావించారు. వారంతా తమకు అనుకూలమైన రిజర్వేషన్‌ వస్తే పోటీకి సై అనాలని ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవి ఏ వర్గానికి కలిసొస్తుంది..? ఎంపీటీసీ స్థానం ఏ కేటగిరీకి కేటాయిస్తారోనని..? జెడ్పీటీసీ స్థానం ఎటు వెళుతుందోనని.. ? ఎంపీపీ పదవులు ఏ వర్గానికి దక్కుతాయి? అనే అంశంపై అంచనాలు వేసుకుంటున్నారు.

గ్రామ పంచాయతీలు 486

ఎంపీటీసీ స్థానాలు 235

జెడ్పీటీసీ స్థానాలు 23

ఎంపీపీలు 23

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement