సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
సిక్కోలు సొమ్ము సరిహద్దు దాటిపోతోంది. హైప్రొఫైల్ జూదరులు వలసపోయి పక్కనున్న ఒడిశాలో పేకాట కింగ్‌లవుతున్నారు. జిల్లాలోని కొందరు బడాబాబులు, ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఊళ్లలో దొరికిపోతామన్న భయంతో సేఫ్ జోన్ కోసం పక్క రాష్ట్రం వైపు రూటు మార్చారు. ఇక్కడి నుంచి కోట్లలో నగదు మూటలను సర్దుకుని, గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటి ఒడిశాలోని పర్లాకిమిడి అడ్డాలకు చేరుకుంటున్నారు. అక్కడ కూడా మన వాళ్లే చక్రం తిప్పుతున్నారు. తాజాగా పర్లాకిమిడి శివార్లలోని దేవిది గ్రామం సమీపంలో ఉన్న జై మాతా దీ కల్యాణ మండపంలో గజపతి జిల్లా పోలీసులు జరిపిన మెరుపు దాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారితో పాటు ఉత్తరాంధ్ర పరిధిలోని మిగతా జిల్లాలకు చెందిన వారు కూడా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్.
పర్లాకిమిడే ఎందుకు..
● శ్రీకాకుళం, పలాస, టెక్కలి, పాతపట్నం, ఇచ్ఛాపురం వంటి సరిహద్దు ప్రాంతాల నుంచి పర్లాకిమిడికి వెళ్లడం చాలా సులువు.
● జిల్లాలో ఇటీవల కాలంలో పోలీసులు దాడులు ఎక్కువ కావడంతో జూదరులంతా సేఫ్ గేమ్ కోసం ఒడిశా వైపు మొగ్గు చూపారు.
● పర్లాకిమిడి శివార్లలోని ఓ ఫంక్షన్ హాల్‌ను ఏకంగా అక్రమ క్యాసినో అడ్డాగా మార్చేశారు. స్థానిక నిర్వాహకులతో చేతులు కలిపిన శ్రీకాకుళం కింగ్ పిన్లు.. ఇక్కడి నుంచి జూదరులను కార్లలో చేరవేసి నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు.
ప్లాస్టిక్ టోకెన్లుగా నగదు మార్పిడి...
● ఈ అక్రమ క్యాసినో నిర్వాహకులు క్రిమినల్ మైండ్‌తో వ్యవహరిస్తున్నారు.
● నేరుగా డబ్బులు పెట్టి ఆడితే పోలీసులకు దొరికిపోతామనే భయంతో శ్రీకాకుళం నుంచి వెళ్లే జూదరుల వద్ద ముందుగానే డబ్బులు వసూలు చేసి, వాటికి బదులుగా నంబర్లు ఉన్న ప్రత్యేక ప్లాస్టిక్ టోకెన్లు ఇస్తున్నారు.
● ఆట ముగిసిన తర్వాత ఆ టోకెన్లను మళ్లీ నగదులా మార్చుకునేలా ప్లాన్ చేశారు.
● శ్రీకాకుళం ఏజెంట్ల సిఫార్సు, ప్రత్యేక కోడ్ వర్డ్ ఉంటేనే లోపలికి రానిస్తున్నారు.
● పక్కా ప్లాన్‌తో నిర్వహిస్తున్న జూద శిబిరంపై పోలీసులు కూడా పక్కా వ్యూహంతో దాడి చేయడంతో జూదరుల గుట్టురట్టు అయ్యింది.
స్క్రీనింగ్ చేశాకే అనుమతి..
శ్రీకాకుళం, పలాస, టెక్కలి, ఆమదాలవలస, కోట బొమ్మాళి, పాతపట్నం ప్రాంతాల నుంచి కొంతమంది ఏజెంట్లు ఈ మాఫియా వెనక చక్రం తిప్పుతున్నారు. పలాసకు చెందిన కొందరు జీడి వ్యాపారులు, ఆమదాలవలస, కోటబొమ్మాళి ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, శ్రీకాకుళంకు చెందిన కొందరు ఉద్యోగుల, వ్యాపారులు గ్రూపులుగా ఏర్పడి వెళ్లారు. వెళ్లిన ప్రతి కస్టమర్ ఐడెంటిటీని ఇక్కడి సబ్ ఏజెంట్లు స్క్రీనింగ్ చేశాకే లోపలికి అనుమతించినట్టు తెలిసింది.
ఆ ఏజెంట్లు ఎవరో..?
పర్లాకిమిడి అడ్డాలో దొరికిన 70 మందిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే అత్యధికులు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఒడిశా పోలీసుల నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. జిల్లాలో ఉంటూ జూదరులను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ఆ లైన్ ఏజెంట్లు ఎవరు? ఫైనాన్స్ వెనక ఉన్న కింగ్ పిన్స్ ఎవరు? అనే కోణంలో లోకల్ క్రైమ్ బ్రాంచ్ ఆరాతీస్తోంది. జూదాన్ని వ్యసనంగా మార్చుకుని, కుటుంబాలను రోడ్డున పడేసే ఇలాంటి తెల్ల చొక్కాల వెనక ఉన్న అసలు రంగు బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పర్లాకిమిడి క్యాసినో నెట్‌వర్క్‌పై పోలీసుల మెరుపుదాడి
పట్టుబడిన 70 మంది జూదరులు
అత్యధికులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే
జాబితాలో రౌడీషీటర్లు కూడా
సీక్రెట్ కోడ్స్...ప్లాస్టిక్ టోకెన్స్‌తో దందా
పర్లాకిమిడిలోని కల్యాణ మండపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేసిన దృశ్యం
జూదరులను వాహనంలో తరలిస్తూ..
పట్టుబడిన 70 మంది
గజపతి జిల్లా పోలీసులు ఆదివారం అర్ధరాత్రి జరిపిన దాడిలో పట్టుబడిన 70 మందిలో అత్యధికులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే ఉన్నారు. పలాస, శ్రీకాకుళం నగరానికి చెందిన పలువురు రియల్ ఎస్టేట్, జీడిపప్పుడు వ్యాపారవేత్తలు ఉన్నారు. జిల్లాకు చెందిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పండుగ సెలవుల సాకుతో ఇక్కడ వచ్చి పోలీసులకు దొరికిపోయారు. రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. టేబుల్స్ కింద దాచి ఉంచిన బ్యాగుల నుంచి రూ.12లక్షలపైబడి నగదును సీజ్ చేశారు. ఘటనా స్థలంలో 9 లగ్జరీ కార్లు, 12 మోటార్ సైకిళ్లు పట్టుబడ్డాయి. సీజ్ చేసిన కార్లలో మెజారిటీ వాహనాలు ఏపీ 30 రిజిస్ట్రేషన్‌తో ఉన్నవే కావడం గమనార్హం.


