కొత్తమ్మతల్లి సంబరం.. కనులారా వీక్షిద్దాం! | - | Sakshi
Sakshi News home page

కొత్తమ్మతల్లి సంబరం.. కనులారా వీక్షిద్దాం!

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

● నేటి నుంచి మూడు రోజుల పాటు

కోటబొమ్మాళిలో ఉత్సవాలు

● లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం

టెక్కలి : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారి 101వ వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పర్యవేక్షణలో టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి దర్శనానికి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వివిధ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన వీఐపీలు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు...

హెలికాప్టర్‌ రైడింగ్‌, అమ్మవారి చరిత్ర తెలిపే డ్రోన్‌ షో వంటి విభిన్న కార్యక్రమాలు జరగనున్నాయి. మంగళవారం సంగిడి పోటీలు, వినీత్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో మెగా మ్యూజికల్‌ నైట్‌, 14న ఉలవల బస్తాలు ఎత్తే పోటీలు, రాత్రి మెగా డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ పోటీలు, అమ్మవారి శోభాయాత్ర, డ్రోన్‌ షో, 15న శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర, బాణసంచా కాల్చడం, కబడ్డీ పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తరలిరానున్న భక్తజనం..

ప్రతి ఏడాది పోలాల అమావాస్య తర్వాత వచ్చే నవరాత్రులలో కొత్తమ్మ తల్లి సంబరాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కమ్మకట్టు కుటుంబీకులు అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదట గ్రామానికే పరిమితమైన అమ్మవారి విశిష్టత కాల క్రమేణ జిల్లాలు దాటి నేడు ఆంధ్రా, తెలంగాణా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

800 మందితో భారీ బందోబస్తు

శ్రీకాకుళం క్రైమ్‌ : కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సోమవారం స్పష్టం చేశారు. ఓ అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, స్పెషల్‌ పార్టీ, రోప్‌ పార్టీ, హోంగార్డుల బృందాలు విధులు నిర్వహించనున్నారని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలు, లైవ్‌ డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తు న్నట్లు చెప్పారు. ఎల్‌ఈడీ తెరలతో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి రద్దీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు తెలిపారు.

విద్యుద్దీపాలంకరణలో కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement