శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘కౌశలం’ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ (బుధవారం) శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9 గంటల నుంచి ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రముఖ ఇండో యంఐయం సంస్థ ప్రతినిధులు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని, వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన కోర్సులు డిప్ల మా (మెకానికల్ ఇంజినీరింగ్–బీఈ, బీటెక్ మెకానికల్) ట్రేడ్లు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఎలాంటి పూర్వ అనుభవం లేని వారు కూడా నియామక ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు తిరుపతి సమీపంలోని సంస్థలో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.
బెండిలో 20 మేకలు చోరీ
వజ్రపుకొత్తూరు రూరల్: వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో శనివారం రాత్రి ముడిమించి రాజారావుకు చెందిన 20 మేకలు చోరికి గురైనట్లు బాధితుడు తెలిపారు. గొర్రెలు,మేకలను పెంచుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నానని, తమ వద్ద ఉన్న చిన్న,పెద్ద అంతా కలిపి 46 మేకలు, గొర్రెలను ఇంటి పక్కన ఉన్న పశువుల శాలలో రాత్రి పూట ఉంచామని తెలిపా రు. అయితే రాత్రి సమయం కావడంతో దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనానికి గురైన మేకల విలువ సుమారు రూ.2.30 లక్షలు ఉంటుందని తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందించానని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్టు పయనం
టెక్కలి: కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు జిల్లా రగ్బీ జట్టు ఆదివారం టెక్కలి నుంచి బయల్దేరింది. అండర్–17 విభాగంలో జరగనున్న ఈ పోటీలకు జిల్లా జట్టుకు కె.అయ్యప్ప, ఎస్.శైలజ తదితర వ్యాయామ ఉపాధ్యాయులు కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపాలని అసోసియేషన్ ప్రతినిధులు బి.నారాయణరావు, కె.రఘనాథరావు, లోకనాథం ఆకాంక్షించారు.


