● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు
గార:
పుట్టిన రోజు నాడే ఆ యువకుడిని మృత్యు దేవత తీసుకెళ్లిపోయింది. జన్మది నం నాడు స్నేహితులతో ఎంతో సరదాగా గడుపుదామనుకున్న ఆ కుర్రవాడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పొందూరు మండలం బి.కంచరాం గ్రామానికి చెందిన మీసాల రాజశేఖర్(20) ఎచ్చెర్లలో ఐటీఐ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం పుట్టిన రోజు కావడంతో తన స్నేహితులతో కళింగపట్నం బీచ్‌కు వెళ్లేందుకు బైక్‌లపై బయల్దేరారు. తూలుగు పంచాయతీ ఉప్ప రిపేట కల్వర్టు వద్దకు వచ్చేసరికి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టాడు. వెంటనే రాజశేఖర్ రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. స్నేహితురాలికి చేతికి బలమైన గాయమైంది. 108 వాహనం ద్వారా రిమ్స్ తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు.


