● తెగేసి చెప్పిన చినగురుదాసుపురం గ్రామస్తులు
● గ్రామసభలో ముక్తకంఠంతో తీర్మానం
కాశీబుగ్గ : తమ ఊరి కూడలిలో మద్యం దుకాణం వద్దే వద్దంటూ చిన్న గురుదాసుపురం గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఆదివారం చిన్న గురుదాసుపురం, కొబ్బరి చెట్లూరు, చిన్న మామిడిమెట్టు, రంగోయి, గురుదాసు పురం, నీలావతి మాకన్నపల్లి, గొల్ల మాకనపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చిన్న గురు దాసుపురంలో సమావేశమయ్యారు. మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. ఉద్దానం ప్రాంతంలో మద్యం దుకాణాలకు తావు ఉండకూడదని, మద్యపానాన్ని ప్రోత్సహించే చర్యలకు ఎవరూ మద్దతు ఇవ్వకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. గురుదాసుపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రూపవతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమం, గ్రామీణ యువత భవిష్యత్ దృష్ట్యా ఈ దుకాణాన్ని ఏర్పాటు చేయకూడదని ముక్తకంఠంతో స్పష్టం చేశారు.
దుకాణం ఏర్పాటుకు స్థలం ఇవ్వబోం
మద్యపాన దుకాణం ఏర్పాటుకు ఎవరూ స్థలం, దుకాణం అద్దెకు ఇవ్వకూడదని సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ‘గ్రామాల కూడలిలో మద్యపాన దుకాణం వద్దు–మా ప్రజల ఆరోగ్యం, కుటుంబాల భవిష్యత్తే ముఖ్యం’ అంటూ సభలో పాల్గొన్న వారంతా నినదించారు.


