● కొరత లేదంటున్న ప్రభుత్వం
● విచ్చలవిడిగా జిల్లాకొస్తున్న ఒడిశా యూరియా
● ఎక్కడికక్కడ బ్లాక్ మార్కెట్ దందా
● రైతులకు అధిక ధరలకు విక్రయం
ఒడిశా యూరియా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు భయాందోళన చెందనక్కర్లేదని ప్రభుత్వం ప్రకటిస్తోంది. జిల్లాలోని రైతులందరికీ ఎరువులు అందిస్తున్నామని, అందిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒడిశా నుంచి జిల్లాకు యూరియా దిగుమతి అవుతోంది. 45 కిలోల యూరియా రూ.267.50 కాగా, జిల్లాలో రూ. 600నుంచి రూ. 700 విక్రయిస్తున్నారు. టన్నులకు టన్నులకు ఒడిశా నుంచి జిల్లాకు వచ్చేస్తోంది.
యూరియాను ఇదివరకులా రైతులకు ఇవ్వ డం లేదు. నిబంధనల పేరుతో బోలెడు పరిమితులు పెట్టారు. దీంతో ఒడిశా యూరియా పేరుతో అక్రమ దందా సాగుతోంది. యూరియా కొరత లేదని అధికారుల రికార్డులు చెబుతుండగా, రబీ మొక్కజొన్న కోసం, జీడితోటల్లో వినియోగం కోసం రైతుల్లో డిమాండ్ ఎక్కువగా వుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు, దళారీలు నేరుగా ఒడిశా నుంచి యూరియా తీసుకు వచ్చి ఇక్కడ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నా రు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఐఫ్‌ఎంఎస్) అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ అక్కడ లేని కొరత మన జిల్లాకు ఎందుకొస్తుందో తెలియడం లేదు.
యూరియా అక్రమ దిగుమతి
గత వారం రోజులుగా ఒడిశా నుంచి జోరుగా యూరియా దిగుమతి అవుతోంది. పర్లాఖిముడి–పాతపట్నం–నరసన్నపేట రోడ్డులో మీదుగా వచ్చి న యూరియాను పట్టుకున్న కేసులు ఇప్పటికే రెండు నమోదయ్యాయి. రైతులకు అవసరమైనంత యూరియా మీరు సరఫరా చేయకపోవడం వల్ల బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వమే సరఫరా చేసి ఉంటే ఒడిశా నుంచి వచ్చిన యూరియా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.
మొక్కజొన్న రైతులే టార్గెట్‌గా..
మొక్కజొన్న రైతులే ప్రధాన వనరుగా అక్రమ వ్యాపారులు, దళారులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా పోలాకి, నరసన్నపేట, గార, లావేరు, పాతపట్నం, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, ఆమదాలవలస, పొందూరు, రణస్థలం, జలుమూరు మండలాల్లో మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంది. అటు రైతుల అవసరాలు, వ్యాపారులు, దళారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టన్నుల కొద్దీ యూరియాను ఒడిశా నుంచి అక్రమంగా తెచ్చి, అధిక ధరకు విక్రయిస్తున్నారు.
ఒడిశా యూరియా ముసుగులో నకిలీ..
జిల్లాలో నెలకున్న కృత్రిమ కొరతతో ప్రభుత్వం తెచ్చిన కొరతో పక్కన పెడితే సరిహ ద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యూరియా దిగుమతి చేసి, అధిక ధరలకు విక్రయించడం ఒకటైతే, ఒడిశా యూరియా ముసుగులో నకిలీ యూరియా దిగుమతి అవుతున్నట్టు తెలుస్తోంది. ఒడిశాలోని బార్బిల్ వంటి ప్రాంతాల్లో నకి లీ యూరియా తయారు చేస్తూ పట్టుబడిన కేసులు ఉన్నాయి. అక్కడి నుంచి వస్తున్న నకిలీ యూరియా సబ్సిడీ ఎరువులో కలిపి జిల్లాకు దిగుమతి చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అదే జరిగితే రైతులకు అధిక ధరలకు కొనుగోలు చేసి నష్టపోవడమే కాకుండా నకిలీ యూరియాతో మోసపోయే అవకాశం ఉంది.
వంద బస్తాల యూరియా సీజ్
నరసన్నపేట: ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి శ్రీకాకుళం ప్రాంతంలో అధిక ధరలకు అమ్మకాలు చేసేందుకు వీలుగా అక్రమంగా తరలిస్తున్న యూరియాను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్‌ఐ రామారావు తన సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం జమ్ము కూడలి వద్ద కాపు కాయగా పర్లాకిమిడి నుంచి వస్తున్న బొలేరో లగేజీ వ్యానును పరిశీలించి తనిఖీలు చేయగా ఎలాంటి రశీదులు లేకుండా తరలుతున్న ఒడిశాకు చెందిన వంద బస్తాల యూరియాను గుర్తించారు. వ్యాన్ డ్రైవర్‌ను ప్రశ్నించగా శ్రీకాకుళానికి చెందిన పి.విజయకుమార్ ఆదేశాల మేరకు పర్లాకిమిడి పట్టణంలో యూరియా కొనుగోలు చేసినట్లు అంగీకరించాడని అధికారులు తెలిపారు. సోమవారమే చల్లపేట వద్ద వంద బస్తాల యూరియా దొరికింది. అంతలోనే మరో వంద బస్తాలు దొరకడం కలకలం రేపింది.


