శ్రీకాకుళం న్యూకాలనీ: బ్యాడ్మింటన్‌లో శ్రీకాకుళం దినదినాభివృద్ధి చెందుతోంది. రాష్ట్రస్థాయి అఫీషియేటింగ్ క్వాలిఫైయింగ్ పరీక్షల్లో జిల్లా నుంచి రికార్డు స్థాయి లో నలుగురు ఎంపికయ్యా రు. ఈ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఎంపికై నవారిలో తమ్మినేని సతీష్ (తురకలకోట హైస్కూల్ పీడీ), ఇమ్రాన్ బేగ్ (బుడుమూరు హైస్కూల్ పీడీ), మెట్ట రాహుల్ మణికృష్ణ, చింతాడ ప్రదీప్‌స్వామి ఉన్నారు. వీరంతా ఏపీ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అంపైర్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వీరు టాప్ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్ తెలిపారు. వీరిని థియరీ, ప్రాక్టికల్ పరీక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దిన సీఈఓ ఎస్.సూరిబాబు సేవలను ప్రశంసించారు.
అయిన వారికే ‘పట్టా’భిషేకం!
టెక్కలి: కోటబొమ్మాళి మండలం కురుడు పంచాయతీ ఎరకయ్యపేట గ్రామంలో ఇళ్ల పట్టాల వ్యవహారం రచ్చకెక్కుతోంది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన సుమారు ఎకరాకు పైగా స్థలా న్ని కొనుగోలు చేసి అప్పట్లో జగనన్న లేఅవుట్ వేశారు. అంతే కాకుండా అక్కడే సుమారు 23 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలతో పాటు పట్టాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణాల కోసం లబ్ధిదారులంతా స్థలాలను ఖాళీగా విడిచిపెట్టారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆయా స్థలాలపై అధికార పార్టీకి చెందిన కార్యకర్తల కన్ను పడింది. దీంతో దిగువ స్థాయి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేయించి మరీ వెరిఫికేషన్ ఇతర కార ణాలను సాకుగా చూపించి 23 మంది లబ్ధిదారుల నుంచి పట్టాలను వెనక్కి తీసుకున్నారు. పట్టాలు వెనక్కి తీసుకున్న తర్వాత సీన్ ఒక్క సారిగా రివర్స్ అయ్యింది. 23 పట్టాలకు చెందిన స్థలాలను రెట్టింపు స్థలాలకు మార్చుకుని అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు వాటిని పంచుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థలాల్లో హద్దుల రాళ్లను సైతం పాతుకున్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ గతంలో ఉన్న లబ్ధిదారుల నుంచి వసూళ్ల కు సైతం పాల్పడినట్లు తెలుస్తోంది. విషయాలన్నీ బయటపడుతుండడంతో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారు.


