శ్రీకాకుళం రూరల్ : వాళ్లేమీ శత్రువులు కారు.. ప్రాణాలు తీసేంత వైరమేమీ లేదు.. కానీ మద్యం మత్తు వారిని బద్ద విరోధుల్లా మార్చేసింది. ఒంటిని కమ్మేసిన నిషా ఒకరిని హంతకుడిగా మార్చగా.. మరొకరి ప్రాణాలను బలికొంది. ఓ చిన్న సంభాషణ గొడవకు దారి తీయడం.. తాగిన మైకంలో తగాదాకు దిగడం.. ఆ గొడవలో ఒకరు మృతి చెందడంతో శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని వప్పంగి వణికిపోయింది. వివరాల్లోకి వెళితే..
గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ మోహనరావు (46) షీట్ సెంట్రింగ్ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో వప్పంగి పరిధిలో గల వైన్‌షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ మద్యం తాగాక వప్పంగి ప్రధాన రహదారిలో గల ఫాస్ట్‌పుడ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు వారి ద్విచక్ర వాహనంపై కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఈలోగా మోహనరావు అక్కడకు వచ్చి కాస్త మెల్లగా మాట్లాడండిరా.. అని గట్టిగా చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు సర్ది చెప్పి పంపించేశారు. ఆ ఇద్దరు కూడా మద్యం సేవించినట్లు సమాచారం.
ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో వప్పంగి నుంచి మోహనరావు తన ఇంటికి వెళ్తుండగా అంతకు ముందు ఆయనతో వాగ్వాదానికి దిగిన వప్పంగికి చెందిన నీలప్పడు, రాయగడకు చెందిన ప్రవీణ్‌లు ఆయనను వెంబడించారు. వప్పంగి పరిధిలో గల ఓ మిల్లు జంక్షన్ వద్ద మోహనరావును ఆపి ముఖం, గుండైపె పిడిగుద్దులు కురిపించారు. దీంతో మోహనరావు అక్కడే అమాంతం కుప్పకూలిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో మోహనరావుతో ఉన్న శిమ్మ శ్రీనుతో పాటు మరో వ్యక్తి కలిసి 108లో రిమ్స్‌కు తరలించా రు. కానీ దారిలోనే మోహనరావు మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పైడపు నాయుడు కేసు నమోదు చేశారు.
సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు
రూరల్ పోలీసులకు మంగళవారం ఉదయం స్థానికంగా మద్యం షాపు వద్ద, రైస్‌మిల్లు వద్ద లభించిన సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటి ఆధారంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో దాడి
అక్కడికక్కడే వ్యక్తి
మృతి
పోలీసుల అదుపులో అనుమానితులు


