చాపర టు ఆమ్‌స్టర్‌డామ్‌ | - | Sakshi
Sakshi News home page

చాపర టు ఆమ్‌స్టర్‌డామ్‌

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

● వరల్డ్‌ సమ్మిట్‌ ఏఐ వేదికపై

ప్రసంగించనున్న సిక్కోలు వాసి విశ్వతేజ్‌

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నెదర్లాండ్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో నేడు 10వేల మందికి ప్రతినిధులతో జరగనున్న వరల్డ్‌ సమ్మిట్‌ ఏఐ వేదికపై ఉత్తరాంధ్రకు చెందిన విశ్వతేజ్‌ శీల ప్రసంగించనున్నారు. ఈ వేదికపై 215 మంది వక్తలు ప్రసంగించనుండగా ఇందులో భారత సంతతికి చెందిన ఐదుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు మాత్రమే ఇండియా నుంచి హాజరవుతున్నారు. గార్డియన్స్‌ ఆఫ్‌ టుమారో: షేపింగ్‌ ది న్యూ ఏఐ పారడైమ్‌( రేపటి సంరక్షకులు, నూతన ఏఐ నమూనానా రూపొందించడం) అనే అంశంపై చర్చించనున్నారు. ఏఐ ఏజెంట్ల మూల్యాంకనంపై కేంద్రీకృతంగా ప్రసంగం చేయనున్నారు. విశాఖపట్నంలో పెరిగిన వ్యక్తికి అంతర్జాతీయ ఏఐ సదస్సులో చోటు దక్కడం వృత్తిపరమైన మైలురాయిగా నిలిచింది.

మెళియాపుట్టి మండలం చాపర గ్రామం నుంచి వలస పోయి విశాఖపట్నంలో స్థిరపడ్డ మాలారావు, ఉషశ్రీ దంపతుల సంతానమైన విశ్వతేజ్‌ శీల ప్రస్తుతం వాంగార్డ్‌లో సీనియర్‌ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2019లో అమృత విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చేసిన విశ్వతేజ్‌ శీల 2022లో బిజినెస్‌ అనలిటిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ కోసం అమెరికా వెళ్లి, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ అట్‌ ఆస్టిన్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్‌ లో నివాసముంటున్న విశ్వతేజ్‌ శీల ఏఐ వ్యవస్థలు కస్టమర్లతో నేరుగా సంభా షించే స్థాయికి చేరుకునే ముందు అవి వాస్తవ ప్రపంచ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయో లేదో ఎలా నిర్దారించాలనే ప్రత్యేక సమస్యపై పరిశోధనలు చేశారు. ఆయన పని ప్రధానంగా ఏజెంటిక్‌ ఏఐపై కేంద్రీకృతమై ఉంది. వాన్‌గార్డ్‌ కోసం ఆయన జనరేటివ్‌ ఏఐ ఆధారిత వాయిస్‌ అసిస్టెంట్‌ను కూడా రూపొందించారు. సాంకేతిక పరిశోధనలో పలు అంశాలపై పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఏఐలో ప్రతిభ కనబరుస్తున్న విశ్వతేజ్‌ శీల ఈనెల 7న ఆమ్‌స్టర్‌ డామ్‌లో జరగనున్న వరల్డ్‌ సమ్మిట్‌లో ఒక ఏఐ ఏజెంట్‌ నిజమైన కస్టమర్‌తో మాట్లాడే ముందు వాస్తవ పరిస్థితులను పోలిన సందర్బాల్లో దాన్ని సంస్థలు ఎలా పరీక్షించాలి? అనే ప్రశ్నను చర్చించనున్నారు. తనకు ఇదొక అత్యుత్తమ సందర్భమని, తనకు లభించిన ప్రతిభతో కూడిన గౌరవమని విశ్వతేజ్‌ శీల ఆనందం వ్యక్తం చేశారు. తన కుమారుడు ప్రపంచ వేదికపై ప్రసంగించనుండటం తమకు గర్వ కారణంగా ఉందని విశ్వతేజ్‌ శీల తల్లిదండ్రులు మాలారావు, ఉషశ్రీ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement