● నేలబావిలో దిగి బీటెక్ విద్యార్థి మృతి
● స్నేహితుల దినోత్సవం వేళ విషాదం
శ్రీకాకుళం రూరల్: మండలంలోని సింగుపురం పంచాయతీ పరిధిలోని మామిడివలస గ్రామ శివారులో ఉన్న నేలబావిలో ఆదివా రం విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల దినోత్సవం రోజున ఆరుగురు స్నేహితులు ఈతకు దిగగా అందులో ఈతరాని ముప్పాన సాయినిఖిల్ (20) నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ఐదుగురు సురక్షితంగా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో నిఖిల్ మృతదేహాన్ని బయటకు తీశారు.
పొందూరు మండలంలోని పాండ్రంకి వీధికి చెందిన నిఖిల్ ప్రస్తుతం సింగుపురంలోని తన తాత వాళ్ల ఇంటి వద్ద ఉంటూ.. టెక్కలిలోని ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా హైస్కూల్ కాలనీలో ఉంటున్న సాయినిఖిల్ ఐదుగురు స్నేహితులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు సమయంలో మామిడివలసలో గల వ్యవసాయ బావి నీటిలోకి స్నానానికి దిగాడు. ముందుగా తోటి స్నేహితులు ఈత వచ్చా అని అడగ్గా వచ్చు అని చెప్పడంతో చిన్నపాటి థర్మాకోల్ షీట్‌ను పట్టుకొని ఈతకు వెళ్లారు. ఇంతలో సాయి నిఖిల్ ఉన్నట్టుండి నీటిలో మునిగిపోయాడు. ఎంతకూ రాకపోవడంతో తోటి స్నేహితు లు కంగారు పడుతూ స్థానికులకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందిస్తూ బోరుబావిలోని కొంత నీటిని తోడించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతుడి తల్లి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


