ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరాలి
● ఇంటర్ అడ్మిషన్ల వేట ● సంక్రాంతి నుంచే కార్పొరేట్ కాలేజీల హవా
మేము విశాఖలో కార్పొరేట్ కాలేజీ నుంచి వచ్చాం. మీ అమ్మాయి బాగా చదువుతుందట. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెస్తుందట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పించండి. అమ్మాయి భవిష్యత్‌కు మాది భరోసా. మంచి విద్యాబోధనతో పాటు అన్నిరకాల వసతులు ఉంటాయి. ఆలస్యం చేస్తే అడ్మిషన్లు పూర్తవుతాయి. ఇలాంటి అవకాశం మీకు రాదు. కొంత మొత్తం అడ్వాన్స్ కట్టి అడ్మిషన్‌ను ఖరారు చేసుకోండి.
– ఎల్‌ఎన్‌పేటకు చెందిన వెన్నెల అనే విద్యార్థిని తల్లిదండ్రులను కార్పొరేట్ ప్రతినిధులు ఒప్పిస్తున్న తీరు ఇది..
హిరమండలం:
టెన్త్ పరీక్షలు అయ్యాక కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలలు పెద్ద మిషనే మొదలుపెట్టాయి. నిజానికి పరీక్షల ముందు నుంచే విద్యార్థుల వేట మొదలైంది. తాజాగా పరీక్షలన్నీ ముగియడంతో ప్రచారాలు పతాక స్థాయికి చేరుకుంటు న్నాయి. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా నడిచే కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి పీఆర్వోలు వందలా ది మంది జిల్లాలో ఉన్నారు. వారు విద్యాశాఖ వద్ద ఉన్న పదో తరగతి విద్యార్థుల వివరాలు తీసుకొని తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడు చేజారిపోకూడదనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. వీరి దూకుడుకు జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు ఉన్నా అడ్మిషన్ల విషయంలో వెనుకబడుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38, ఆదర్శ పాఠశాలలు 13, కేజీబీవీలు 25, ప్లస్ 2 పాఠశాలలు 6, గురుకుల పాఠశాలలు 9 ఉన్నాయి. ప్రతి సంవత్సరం 20 వేలకుపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. గత ఏడాది పదో తరగతి విద్యార్థులు 28,176 మంది పరీక్షలకు హాజరుకాగా.. 23,219 మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ ఇందులో కేవలం 6,491 మంది మాత్రమే జిల్లాలో ఇంటర్‌లో చేరారు. ఈ ఏడాది 29,362 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరికలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నా యి. అధ్యాపకుల కొరత విద్యాబోధనపై ప్రభావం చూపుతోంది. అటు ఆశించిన స్థాయిలో జూనియర్ కాలేజీల్లో వసతులు ఉండడం లేదు. ఉత్తీర్ణతా శాతం అంతంత మాత్రమే. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి.
వైఎస్సార్‌సీపీ హయాంలో..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేజీబీవీల్లో ఇంటర్ కాలేజీలను అప్‌గ్రేడ్ చేశారు. సంప్రదాయ కోర్సులతో పాటు సాంకేతిక కోర్సులు సబ్జెక్టులను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగం, ఉపాధినిచ్చే కోర్సులు సైతం వచ్చాయి. అలాగే 2021లో నరసన్నపేట మండలం ఉర్లాం, సరుబుజ్జిలి మండలం రొట్టవలస, పలాస మండలం బ్రాహ్మణతర్లా, మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు, టెక్కలి మండలం టెక్కలిలో ప్లస్ 2గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. అప్పట్లో ఇవన్నీ విద్యార్థులతో నిండిపోయి కళకళలాడేవి. కానీ గత రెండేళ్లలో సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేసవిలో అధికారులు అవగాహన పెంచుతున్నా విద్యార్థులు ఆసక్తి చూపని పరిస్థితి.
పీఆర్వోల హల్‌చల్
జిల్లా నుంచి ఎక్కువగా విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో చేరుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 71 జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. కానీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం సీట్లు నిండడం లేదు. సంక్రాంతి నుంచే కార్పొరేట్ కంపెనీల పీఆర్వోలు గ్రామాల్లో ప్రవేశిస్తున్నారు. విద్యార్థుల అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి ఫీజులతో పాటు హాస్టల్‌కు రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు.
మీ పిల్లాడు చాలా బాగా చదువుతాడట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పిస్తే పిల్లాడి భవిష్యత్‌కు మాదీ భరోసా. విద్యార్థికి ఇంటర్ కీలకం. అందుకే మా కాలేజీలో చేర్పించండి. మంచి విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి అన్నిరకాల శిక్షణలు ఇస్తాం. నీట్, జేఈఈ, ఎంసెట్ ఇలా అన్ని రకాల శిక్షణలు ఉంటాయి. ముందుగా చేరితే ఫీజుల్లో రాయితీ ఉంటుంది. ఆలస్యం చేస్తే వెనుకబడి పోతారు.
– హిరమండంలో శ్రీనివాస్ అనే పదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులను కలిసి కార్పొరేట్ కాలేజీ ప్రతినిధులు చెప్పిన మాట ఇది..
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధనతో పాటు సౌకర్యాలు ఉంటాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇవి ఎంతో మేలు. అనవసరం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భారం పడవద్దు. కేజీబీవీల్లో విద్యార్థినులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధన, రక్షణ, వసతులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.
– కృష్ణవేణి,
ఎస్‌ఓ, హిరమండలం కేజీబీవీ


