అకాల వర్షం..
శ్రీకాకుళం రూరల్: అకాల వర్షం కారణంగా జొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని కళ్లేపల్లి పంచాయతీ పరిధిలోని బందరువానిపేట, మోఫస్‌బందరు, పరదేశీపాలెం, ఇప్పిలి, తదితర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం కురిసిన తీవ్రగాలులకు, వర్షానికి ఈ నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయాధికారి నవీన్ తెలిపారు.
వడగళ్ల వాన
కంచిలి: మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్ష బీభత్సంతో మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో నష్టాలు ఏర్పడ్డాయి. ఈదురుగాలులు వీయడంతో రేకులు ఎగిరి పడటం, చెట్లు కూలిపోవడం, గోడలు కూలిపోవడం, జీడి, మామిడి పిందెలు రాలిపోవడం వంటి నష్టాలు ఏర్పడ్డాయి. మండపల్లి గ్రామంలో మాదిన ధనుంజయకు చెందిన రేకుల షెడ్డులో రేకులు ఎగిరిపడి, పక్కనే ఉన్న సోలార్ యూనిట్ ప్యానల్స్ మీద పడ్డాయి.
కుదేలైన అరటి రైతులు
జి.సిగడాం : అరటి పంట సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరైపోయాయి. పంట చేతికొచ్చిన సమయంలో అకాల గాలి వాన పంటలను ధ్వంసం చేసిందని వెంకయ్యపేట గ్రామానికి చెందిన గల్లా కృష్ణ ఆందోళన చెందుతున్నారు. రెండు ఎకరాలు అరటి తోట ఈనెల 6న వీచిన గాలలుకు పూర్తిగా నేలమట్టం అయిపోయిందని వాపోయారు. ఎకరాకు సుమారుగా 80 వేలు రూపాయల వరకు మదుపులు పెట్టామని వాపోతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో ఇలాంటి వానలు రావడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.


