మందస: మందస మండలం పుచ్చపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగు పడి వృద్ధుడు మృతి చెందారు. గ్రామానికి చెందిన శిష్టు బీమారావు(72) ఊరిలోని రావి చెట్టు చెరువు వద్దకు వెళ్లి కాళ్లు కడుగుతుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే నీటిలో పడి ప్రాణాలు వదిలేశారు. సాయంత్రం అటుగా వెళ్తున్న గ్రామస్తులు బీమారావును గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే అంబుగాం గ్రామంలో ఇంటిపై పిడుగు పడి ఓ మహిళ అస్వస్థతకు గురైంది. భిన్నళమదనాపురంలోనూ చెట్టుపై పిడుగు పడి పక్కన ఉన్న పూరి గుడిసైపె మంటలు రేగాయి.
రైలు ఢీ కొని యువకుడు..
పాతపట్నం: మండలంలోని తెంబూరు రైల్వే స్టేషన్ సమీపంలోని తెంబూరు ఎస్సీ వీధి సమీపంలో రైలు ఢీ కొని తెంబూరు ఎస్టీ వీధికి చెందిన గిట్టంగి హిమగిరిరావు(20)మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... మంగళవాం సాయంత్రం గుణుపూర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలు తెంబూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత.. తెంబూరు ఎస్సీ వీధి సమీపంలో గిట్టంగి హిమగిరిరావును ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తండ్రి గిట్టంగి అప్పలస్వామి, తల్లి గిట్టంగి లక్ష్మి ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి..
రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు పోవు ఎన్‌హెచ్–16 రోడ్డు మీద సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు. తాళ్లవలస వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేశారు. మృతుని శరీరంపై బిస్కట్ రంగు చొక్కా లుంగీ ధరించి ఉన్నారు. వివరాలు తెలిస్తే సమాచారం అందిచాలని లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరి తెలిపారు. వివరాలు తెలిస్తే ఫోన్ నంబర్స్ 6309990816, 6309990851 నంబర్లకు తెలియజేయాలని సూచించారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సంపద పంపిణీతోనే సామాజిక న్యాయమని, జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ జయంతులను వాడవాడలా నిర్వహించి సామాజిక న్యాయ వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. శ్రీకాకుళం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దేశంలో కొద్దిమంది దగ్గర పోగుపడిన సంపదను వివిధ పన్నుల ద్వారా సేకరించి పునఃపంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలని, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న అన్ని శ్రామిక సంఘాలు, దళిత, బహుజన, మైనార్టీ, మహిళా సంఘాలు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాంగానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం అంటేనే బిలియనీర్లు, కార్పొరేట్ల ప్రభుత్వమని పేరు పొందిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై.వేణు తదితరులు పాల్గొన్నారు.


