● జిల్లాలో పెళ్లి ముహుర్తాల జోరు ● ముగియనున్న మూడు నెలల
19 నుంచి శుభముహూర్తాలు
శ్రీకాకుళం కల్చరల్/శ్రీకాకుళం: మూడు నెలల విరామం తర్వాత మంచి ముహూర్తాలు రావడంతో మళ్లీ వివాహాల సందడి మొదలైంది. గత ఏడాది నవంబరు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకు మూఢాలు కావడంతో చాలామంది వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. మాఘ మాసం వివాహాలకు మంచిదైనప్పటికీ మూఢం కారణంగా ఫిబ్రవరి 18 వరకు సరైన ముహుర్తాలు లేకుండాపోయాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 19 నుంచి ఫాల్గుణ మాసం మొదలు కావడంతో వివాహాలకు సిద్ధమవుతున్నారు.
అంతటా బిజీబిజీ..
ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది అపురూప ఘట్టం. వివాహ మధురానుభూతులను జీవితాంతం గుర్తుగా దాచుకోవాలనుకుంటారు. పెళ్లి ముహూర్తాలు మొదలుకావడంతో వివాహ సంబంధిత వ్యాపారాలైన భాజాభజంత్రీలు, డెకరేషన్ నిర్వాహకులు, కర్పూర దండల షాపులు, లైటింగ్, మైక్‌సెట్ నిర్వాహకులు, వస్త్ర వ్యాపారులు, బంగారం షాపుల వద్ద హడావిడి బాగా పెరిగింది. పెళ్లి మండపాలకు డిమాండు బాగానే ఉంది. ఇక, ముహుర్తాల కోసం జాతకాలు తీసుకొచ్చే వారితో జ్యోతిషాలయాల కిటకిటలాడుతున్నాయి. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి.
భోజనాల్లో తగ్గేదేలే..
వివాహ వేడుకల్లో భోజనాలదీ కీలక ఘట్టమే. దీనికోసం జిల్లాలో అనేక కేటరింగ్ సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి. వడ్డించే ఐటెమ్స్ బట్టి ధరలు ఉన్నాయి. ప్లేట్ రూ.150 నుంచి రూ.1000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొందరు దూరప్రాంతాలైన విశాఖ, విజయవాడ, రాజమండ్రిల నుంచి సైతం కేటరింగ్ సర్వీసులను రప్పిస్తున్నారు.
ఔట్ డోర్ అలంకరణ
గత ఏడాది నవంబరు నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండడంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి శుభముహుర్తాలు మొదలు కానున్నాయి. చాలా మంది వివాహాలకు సన్నద్ధమవుతున్నారు.
– తెన్నేటి విక్రమశర్మ,
పంచాంగకర్త
● జిల్లాలో పెళ్లి ముహుర్తాల జోరు ● ముగియనున్న మూడు నెలల


