ప్రాణాలైనా అర్పిస్తాం..పరిశ్రమను అడ్డుకుంటాం
● ఆక్వా బ్రూవరీస్ పరిశ్రమ వద్ద స్థానికుల నిరసన
రణస్థలం:
తమ వ్యవసాయాలకు అడ్డంకిగా మారుతున్న బ్రూవరీస్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే తమ ప్రాణాలైనా అర్పిస్తామని రణస్థలం పంచాయతీ రైతులతో పాటు మహిళలు హెచ్చరించారు. మండలంలోని రణస్థలం పంచాయతీలో గల నగరప్పాలెం గ్రామ సమీపంలో నిర్మించ తలపెట్టిన రవికిరణ్ బ్రూవరీస్ (వాటర్ ప్లాంట్)ను వ్యతిరేకిస్తూ గత మూడు నెలలుగా గ్రామ రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో గురువారం అదే పరిశ్రమలో పని చేసేందుకు కొంత మంది కార్మికులు రావడంతో గ్రామస్తులంతా ఏకమై పరిశ్రమ వద్దకు వచ్చారు. పరిశ్రమ వల్ల తమకు ఇబ్బందులు ఉన్నాయని, మీరు పని చేయడం సరికాదని చెప్పడంతో వాళ్లు పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వెనుదిరిగారు. పరిశ్రమను వ్యతిరేకిస్తున్న రైతులపై ఇటీవల జే.ఆర్.పురం పోలీసులు కేసులు నమోదు చే యడంతో పంచాయతీ వాసులు కోపోద్రిక్తులై ఉన్నా రు. నష్టం కలిగించే పరిశ్రమ వద్దని నిరసన తెలిపితే కేసులు నమోదు చేస్తున్నారని రైతులతో పాటు మ హిళలు కూడా ఆందోళనకు దిగారు. కేసులు నమోదు చేసినా భయపడబోమని, పంచాయతీలో ఉన్న వెయ్యి మంది మహిళలపై కేసులు నమోదు చేస్తే చేసుకోండని తమ ప్రాణాలైనా అర్పిస్తాం గానీ పరిశ్రమను పెట్టనివ్వబోమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిశ్రమ ఆగే వరకు పోరాటం ఆగదు
ఈ క్రమంలో జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తన సిబ్బందితో అక్కడకు వచ్చారు. టెంట్ వేసి నిరసన తెలపడం సరికాదని, ఇక్కడ పని చేసేందుకు వచ్చిన కార్మికులను ఎందుకు పంపించేశారని మీ మీద కేసులు నమోదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమపై కేసులు నమోదు చేశారని, దాడి చేసిన పరిశ్రమ వ్యక్తులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని అక్కడి వారంతా ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు పరిశ్రమ యాజమాన్యానికి వత్తాసు పలికితే గ్రామస్తులంతా శాంతియుతంగా పరిశ్రమ ఆగేవరకు ఎదుట నిరసన తెలుపుతామని, కేసులు నమోదు చేస్తే మీ ఇష్టం అని రైతులు, గ్రామ పెద్దలు పోలీసులకు వివరణ ఇచ్చారు.
రైతులకు ఉపయోగపడే ధాన్యం మిల్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు పనికి వచ్చే పరిశ్రమ పెడితే సహకరిస్తాం తప్పా ఇలా భూగర్భ జలాలు తోడేసే పరిశ్రమ తమకు నష్టం అని తేల్చి చెప్పారు. గ్రామ వినాశనానికి దారితీసే పరిశ్రమ వద్దని, పని జరిగితే తా ము అడ్డుకుని తీరుతామని మహిళలంతా నినదించారు. ప్రస్తుతం పని జరగడం లేదు కదా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఎస్‌ఐ చిరంజీవి మహిళలను, రైతులను సముదాయించారు.


