● ఆరోగ్య దాత.. అభయ ప్రదాత
అరసవల్లి: ఆరోగ్యం కోసం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని అర్చిస్తుంటారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ క్షేత్రంలో సూర్యనమస్కారాల పూజలు, మండల దీక్షలు ఈ క్షేత్రంలో నిత్యం చేస్తుంటారు. భక్తుల కోసం..భక్తుల పేరిట సూర్యనమస్కారాల పండితులే ఈ ఆసనాలను వేస్తూ.. ఈ ప్రక్రియను ముగిస్తారు.
1. ప్రణమాసనం, 2. హస్త ఉత్తానాసనం, 3. పాదహస్తాసనం, 4. అశ్వసంచాలనాసనం, 5. ఖట్వాంగాసనం, 6. సాష్టాంగ నమస్కారం, 7. భుజంగాసనం. ఈ ఏడు ఆసనాలనే పన్నెండు ఆసనాలుగా చేస్తూ ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రత్యేకంగా కళ్లు, చర్మవ్యాధులు, హృద్రోగ బాధలు తదితర ఈతిబాధలతోనూ, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో అవస్థలు పడుతున్న వారి కోసం 41 రోజుల మండల దీక్ష.. (40 రాత్రులు) ను ఇక్కడి పండితులు చేపడుతుంటారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఈ దీక్షను చేయించుకునే భక్తులు కచ్చితంగా సాత్వికాహారం మాత్రమే భుజించాలి. శుచిభూతంగా ఉండాలి. నిత్య దీపారాధన, ఆదిత్యమంత్రోచ్ఛరణను తప్పకుండా ఆచరించాలని పండితుల సూచన. ఈ దీక్షలతో అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.


