రథసప్తమి ఏర్పాట్ల పరిశీలన
శ్రీకాకుళం: అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామి వారి దర్శనం కోసం సామాన్య భక్తులకు అగ్రతాంబూలం ఇస్తున్నామని, గర్భగుడి ఎదుట నాలుగు వరుసల్లో దర్శనం కల్పించడం ద్వారా భక్తులు క్యూలలో వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తామని దేవదాయ శాఖ కమిషనర్, రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన రథసప్త మి ఉత్సవాల నిర్వహణపై డీఎస్పీ వివేకానందతో కలిసి ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కమిషనర్‌కు స్వాగతం పలికారు. తదుపరి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్‌లో కీలక శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని దేవదాయ శాఖ తరఫున 70 ట్యాంకులు, 30 వేల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు రూ.300, రూ.100 టికెట్లను రేపటి నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తామన్నారు. క్షీరాభిషేకం టికెట్స్ ఆన్‌లైన్ ద్వారా 24వ తేదీ నుంచి బుక్ చేసుకోవాలని సూచించారు. రథసప్తమి ఏర్పాట్లలో భాగంగా దేవదాయ శాఖ నుంచి 100 మంది సిబ్బంది 500 మంది వలంటీర్లు పాల్గొంటారని తెలిపారు. క్యూల వద్ద భక్తులకు ఎండ తగలకుండా షేడ్ నెట్లు, చల్లని మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యవేక్షణలో డీఎస్పీ వివేకానంద, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివరామప్రసాద్ (హరి), ప్రత్యేక అధికారి శోభారాణి, సింహాచలం దేవస్థానం సూపరింటెండెంట్ కంచమూర్తి, దేవస్థానం ఈఓ ప్రసాద్ రావు, అరసవల్లి ఆలయ సిబ్బంది, వివిధ స్థాయి అధికారులు పాల్గొన్నారు.


