ప్రజాధనం వృథా!
● నిరుపయోగంగా ప్రభుత్వ కార్యాలయ భవనాలు ● పట్టించుకోని అధికారులు
ఎచ్చెర్ల : ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ఎచ్చెర్ల మండలంలో అవసరం లేకుండా కోట్ల విలువ చేసే భవనాలను నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించే కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో పౌరసరఫరాల గోదామును పదేళ్ల క్రితం నిర్మించారు. ఆహార పదార్థాల నిల్వకు, సరుకుల సరఫరాకు అన్ని విధాలా ఉపయోగపడేలా మోడల్‌గా నిర్మించారు. తర్వాత వివిధ కారణాలతో ప్రారంభించకుండానే వదిలేశారు. చిలకపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్మించారు. ఇది కూడా అధునాతన పద్ధతిలో 15 ఏళ్ల కిందట నిర్మించారు. కొన్నాళ్లు దివ్యాంగుల కార్యకలాపాలు కొనసాగించారు. వారికి అవసరమైన పరికరాలు అందించడంతో పాటు పిజియోథెరపి అందించడానికి నిర్మించిన ఈ భవనాన్ని తర్వాత మూసివేశారు. ప్రస్తుతం పిచ్చిమొక్కలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మరోవైపు మండలంలో పీఏసీఎస్ కేంద్రాన్ని అద్దె భవనంలో నడిపిస్తున్నారు. వీటితో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను కూడా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
ప్రజాధనం వృథా!


