10 నుంచి సమ్మేటివ్ పరీక్షలు
నరసన్నపేట: పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు సమ్మేటివ్ ఎసెస్‌మెంట్– 1 పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌లో విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలు 2,955 ఉండగా.. వాటిలో 2,64,804 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరితో పాటు ప్రైవేటు స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు సైతం పరీక్షలు రాస్తారు. ఏ రోజు ప్రశ్నపత్రాలు ఆరోజు ఆయా మండలాల ఎంఈవోల వద్ద నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలను ఆయా మండలాల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేర్చారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 6, 7 తరగతులకు చెందిన విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు
సారవకోట: మండలంలోని కుమ్మరిగుంట సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గ్రామానికి చెందిన సారవకోట రమణ గాయపడ్డాడు. రమణ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సారవకోట వైపు నుంచి చల్లవానిపేట వైపు వెళ్తున్న ఆటో వెనుక నుంచి ఢీకొనడంతో గాయాలపాలైయ్యాడు. ఈయనను 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.


