రెచ్చిపోతున్న రౌడీలు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న రౌడీలు

Nov 8 2025 7:32 AM | Updated on Nov 8 2025 7:32 AM

రెచ్చిపోతున్న రౌడీలు

రెచ్చిపోతున్న రౌడీలు

ప్రశాంత సిక్కోలులో భూకబ్జాలు, దందాలు, కిడ్నాప్‌లు

బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, ఇతర అసాంఘిక

కార్యకలాపాల్లోనూ హవా

చూసీచూడనట్లు వదిలేస్తున్న పోలీసులు

శ్రీకాకుళం క్రైమ్‌:

కాశీబుగ్గలో గురువారం వైశ్య కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్‌ చేయడానికి రెండు కార్లలో ఎనిమిది మంది వ్యక్తులు ఆమదాలవలస నుంచి వచ్చారు. ఆర్థిక లావాదేవీలే ఈ వ్యవహారానికి కారణం. కిడ్నాప్‌ చేయడానికి వచ్చింది ఇద్దరికీ ఏ సంబంధం లేని రౌడీలు.. సెటిల్మెంట్‌ బ్యాచ్‌లు..

● ఇటీవల జిల్లాకేంద్రంలోని బ్యాంకర్స్‌ కాలనీకి సరుబుజ్జిలి మండలం మూలసవలాపురం గ్రామానికి చెందిన ఓ లేడీ రౌడీషీటర్‌ బ్యాచ్‌ రాత్రిపూట ఇంట్లో చొరబడింది. వైశ్యుడైన ఇంటి యజమానిని బెదిరించేందుకు అద్దెకున్న వ్యక్తే ఇలా చేశాడన్నది ఒక ఎత్తయితే.. సెటిల్‌మెంట్‌కు వెళ్లిన నగర బ్లాక్‌ మెయిలింగ్‌ బ్యాచ్‌లు లక్షల్లో వారి దగ్గర దోచేయడం మరో ఎత్తు.

● జిల్లాకేంద్రంలోని ఓ షాపులో అద్దెకున్న రాజస్థాన్‌ వ్యక్తిని ఖాళీ చేయించేందుకు యజమానే స్థానిక రౌడీలను పురమాయించాడు.

● అప్పట్లో బలగ నడిబొడ్డున ఓ వ్యక్తి కారును వెంబడించి ద్విచక్ర వాహనాలతో అడ్డుకోవడమే కాక రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టి లోపలి వ్యక్తిని బయటకు లాగి వందల మంది చూస్తుండగా దాడి చేశారు. ప్రజల ఫోన్లే కాదు.. అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో కూడా దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. అదేమీ పెద్ద విషయం కాదన్నట్టు ఇప్పటికీ పోలీసులు ఛార్జిషీటు వేయలేదు. తిరిగి అదే వ్యక్తిపై కేసులు, చార్జిషీట్లు నమోదు చేశారు..

ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు ప్రశాంతతకు మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలో నిత్యకృత్యమవుతున్నాయి. శాంతిభద్రతలు నిర్వీర్యం, పోలీసుల నిఘా వైఫల్యం చెందాయనడానికి వారు కడుతున్న కేసులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రశాంత సిక్కోలులో భూకబ్జాలు, ఆర్థిక లావాదేవీలు, దందాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు, సుపారీ హత్యలు వంటి సెటిల్మెంట్‌ వ్యవహారాలే కాక గంజాయి, నకిలీ నోట్లు, బెట్టింగ్‌, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాల్లోనూ పాత రౌడీషీటర్లు, కొత్త రౌడీలు పేట్రేగిపోతున్నారు. ఎక్కువగా జిల్లాకేంద్రం గాను, కాశీబుగ్గ కేంద్రంగానే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అత్యధిక కేసులు ఉన్నవారు, షీట్‌ ఉన్న వారే పదే పదే నేరాలకు పాల్పడటం గమనార్హం.

పక్షపాతమెందుకో..

జిల్లాలో దాదాపు 589 మంది రౌడీషీటర్లున్నట్లు పోలీసుల సమాచారం. బైండోవర్లు, సస్పెక్ట్‌షీట్లు, రౌడీషీట్లు, పీడీయాక్టులు పక్షపాత ధోరణిలోనే పోలీసులు కడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు హత్యలు జరిగిన ఫరీదుపేటలో ఒక వర్గం నాయకుడికి పీడీయాక్టు కట్టి మరోవర్గం వారికి విడిచిపెట్టడం, పేకాటలో రూ.లక్షల్లో ఆడేవారిని వదిలేసి టాక్సీస్టాండుల్లో చిల్లరతో దొరికేవారిని బహిరంగంగా శిక్షలు విధించడాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.

● కార్యకర్తను స్టేషన్‌కు పిలిపించడంతో ఆరా తీసేందుకు వెళ్లిన రాజకీయ నాయకులపైనా, ర్యాలీలు, సమూహాల్లో మహిళా హోంగార్డుపై అనుచిత ప్రవర్తన అంటూ ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. వజ్రపుకొత్తూరు మండలంలో ఇటీవల రెండు వర్గాల తగాదాలో ఓ మహిళ చీర లాగేస్తే మాత్రం ఆ అధికారిపై చర్యలు తీసుకోలేదు.

ఎందుకంత ప్రేమో..?

వారం వారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ నిర్వహించినా రౌడీలు ఒక్కొక్కరుగా వారికి నచ్చిన సమయాల్లో వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. ఎక్కువ శాతం మంది గైర్హాజరే. ఓ రౌడీషీటర్‌ ఏకంగా తనపై ఉన్న కేసు గురించి ఎస్‌ఐతో ఎమ్మెల్యే మాట్లాడించేలా చేశాడు. అదే రౌడీషీటర్‌ కానిస్టేబుల్‌తోనూ సంభాషణ చేశాడు.

కౌన్సిలింగ్‌కు రాకపోతే ఇంత, సమాచారమిస్తే ఇంత అంటూ రేట్లు కూడా నిర్ధారిస్తుండటంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యంషాపులు, బార్లు, బెల్టు దుకాణాలు, దాబాలు, లాడ్జీలు, బెట్టింగ్‌, పేకాటల వద్ద కొందరు పోలీసులు చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే ఓ ఉన్నతాధికారి ఇలాంటి వ్యవహారంలో వీఆర్‌కు చేరుకోగా, మరో అధికారి సైతం నాలుగైదు కేసుల్లో గట్టిగానే వసూలు చేశారనే విమర్శలు లేకపోలేదు. ఇక వ్యాపార కేంద్రంగా చెప్పుకునే మరో పట్టణంలో సీఐ హవా చెప్పక్కరలేదు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసుల పక్షపాత వైఖరి కారణంగా రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారనేది జగమెరిగిన సత్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement