
ప్రైవేటీకరణ కుట్రలు అడ్డుకోండి
రణస్థలం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల మహా ఉద్యమం, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ సమక్షంలో లావేరు మండలం తామాడ గ్రామంలో మంగళవారం రచ్చబండ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్య, వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ గొప్ప ఆశయానికి తూట్టు పొడిచి, వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ మొదలుకొని అమ్మ ఒడి వరకు కూటమి ప్రభుత్వం అన్నింటినీ రద్దు చేసే కుట్ర చేస్తోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వైఎస్సార్‌సీపీకి మద్దతుగా సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు కె.వి.జి.సత్యనారాయణ, లావేరు మండల ప్రత్యేక ఆహ్వానితుడు రొక్కం బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు దన్నాన రాజినాయుడు, వ్యవసాయ సలహా మండలి కార్యవర్గ సభ్యులు గొర్లె అప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యులు మీసాల సీతంనాయుడు తదితరులు పాల్గొన్నారు.