
దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్వాభిమాన్’ నేడు
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రత్యేక కార్యక్రమం ‘స్వాభిమాన్’ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది.
డైస్ సెంటర్ ఆకస్మిక తనిఖీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్‌మెంట్ సెంటర్ (డైస్)ను గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదరి కె.హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 0–6 ఏళ్ల లోపు అంగవైకల్య ప్రమాదం ఉన్న పిల్లలకు సమగ్రమైన సమగ్ర సేవలను అందించాలని సూచనలు ఇచ్చారు. వైకల్యాన్ని ముందుగానే గుర్తిస్తే వ్యాధి నయం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. తలసేమియా వంటి వ్యాధులను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి మెరుగైన సేవలు అందించాలని సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఎన్ చైతన్య, మేనేజర్ అప్పలనాయుడు, ఇతర వైద్య నిపుణులు ఉన్నారు.
‘మహిళా హోంగార్డుపై
అనుచితంగా ప్రవర్తించినందుకే’
శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కల్తీ మద్యంపై ఇటీవల జరిపిన నిరసన ఘటనకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం విలేకరులతో మా ట్లాడారు. అనుమతి లేని ర్యాలీలు, ధర్నాలకు గుంపులుగా రావడమే కాక విధుల్లో ఉన్న ఓ మహిళా హోంగార్డుపై అనుచిత ప్రవర్తనకు వేణు గోపాలరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు తెలిపారు. ప్రోత్సహించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా కేసులు పెట్టామన్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన నకిలీ స్టాంపుల వ్యవహారంపై విలేకరులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా.. కేసుకు సంబంధించి ఫేక్ రబ్బరు స్టాంపుల తయారీదారులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించా మని, పక్కా ఎవిడెన్సులతో కొన్ని నకిలీ డాక్యుమెంట్లను గుర్తించామన్నారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని, ఎవరున్నా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె చేయనున్నట్లు ఏఐటీయూసీ కౌన్సిల్ సభ్యులు టి.తిరుపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణి.అప్పలరాజు తెలిపారు. ఈ మేర కు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మున్సిపల్ కార్మికులకు ఇల్లు, స్థలాలు కేటాయించి మున్సిపల్ కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు జె.గురుమూర్తి, ఎన్. పార్థసారథి, ఆర్. గణేష్, పి.సురేష్, రామచంద్ర, రసూల్, తంగి.నారాయణరావు, పుష్ప ,సీతయ్య, ప్రతినిధి అరుగుల రమణ తదితరులు పాల్గొన్నారు.
దళిత చట్టాలపై అవగాహన
శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితులు సమాజంలో గౌరవం పొందేందుకు, వారు ఆత్మాభిమానంతో మెలిగేందుకు ప్రభుత్వం, చట్టాలు రక్షణగా ఉంటాయని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ సంక్షేమ పథకాలపై గురువారం అవగాహన కార్యక్రమం జరిగింది. లీడ్ జిల్లా మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ లలిత కుమారిలు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఎస్సీలకు ప్రత్యేక రుణాలు, రాయితీలు ఉన్నాయని, వీటిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొందవచ్చని తెలిపారు.

దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్వాభిమాన్’ నేడు