దాడి కేసులో ఏడుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దాడి కేసులో ఏడుగురి అరెస్టు

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

బత్తలపల్లి: ఇంటి ముందు చెత్త, వర్షపు నీరు ఊడ్చే విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఏడుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్టు బత్తలపల్లి పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు. మండలంలోని అనంతసాగరం గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఈ నెల 11వ తేదీన వర్షపు నీరు ఊడుస్తున్న శివకృష్ణ భార్య మమతతో ఎదురింటిలో ఉన్న పోతులయ్య భార్య లక్ష్మక్కలు వాదులాడుకున్నట్టు చెప్పారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన పురుషులకు విషయం చెప్పడంతో వారు మరోసారి ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో శివకృష్ణ, ఆయన తండ్రి కాటమయ్యపై గుజ్జల పోతులయ్య, గుజ్జల నాగేంద్ర, గుజ్జల ఉపేంద్ర, గుజ్జల పవన్‌కుమార్‌, గుజ్జల ప్రవీణ్‌కుమార్‌, గుజ్జల అనూష, గుజ్జల సువర్ణ దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో శివకృష్ణ తలకు తీవ్ర గాయపడినట్టు తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి ధర్మవరం కోర్టులో హాజరు పరచగా, జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో అనంతపురం జైలుకు తరలించినట్టు పోలీసులు తెలియజేశారు.

ధర్మవరంలో దొంగల హల్‌చల్‌

ధర్మవరం అర్బన్‌: ధర్మవరంలో ద్విచక్ర వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మంగళవారం రాత్రి అంజుమన్‌ సర్కిల్‌లో గంగాధర్‌రెడ్డికి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బైకును దొంగలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై బుధవారం వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇటీవల శ్రీదేవి థియేటర్‌ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలను దొంగలు ఎత్తుకెళ్లడంతో యజమానులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల పట్టణంలో బైకుల దొంగతనాలు ఎక్కువవ్వడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

క్రేన్‌ డ్రైవర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?

● మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన బాధిత కుటుంబసభ్యులు

పరిగి: మండల కేంద్రంలోని ఇండియన్‌ డిజైన్స్‌ గార్మెంట్స్‌ పరిశ్రమ వద్ద మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గత మంగళవారం సాయంత్రం ఇదే గార్మెంట్స్‌ పరిశ్రమ వద్ద నరేష్‌ అనే యువకుడిని క్రేన్‌ వాహనం ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే చనిపోయిన విషయం విదితమే. మృతుడి తల్లి చౌడమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం చేయించారు. ఈక్రమంలో ప్రమాదానికి కారణమైన క్రేన్‌ వాహన డ్రైవరును ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు బుధవారం ఆందోళనలు చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించిన శవం ఉన్న అంబులెన్స్‌తో గార్మెంట్స్‌ పరిశ్రమ వద్ద హిందూపురం = మడకశిర ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ రవికుమార్‌ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. మృతికి కారకుడైన డ్రైవరు కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.

బాగోగులు చూడనోడికి..

ఏమివ్వాలి.. ఎందుకివ్వాలయ్యా

● డబ్బు, బంగారం ఇవ్వాలంటూ వేధిస్తున్న కుమారుడు

● భరించలేక ధర్మవరం డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధ తల్లి

ధర్మవరం అర్బన్‌: డబ్బులు, బంగారం కావాలంటూ తన చిన్న కుమారుడు వేధింపులకు గురి చేస్తున్నాడని ధర్మవరం డీఎస్పీ జగన్నాథ్‌రాజుకు ఓ తల్లి బుధవారం ఫిర్యాదు చేసింది. వృద్ధురాలు తెలిపిన మేరకు వివరాలు. పట్టణంలోని పాత బస్టాండ్‌కు చెందిన సుగుణమ్మ(80)కు ఇద్దరు కుమారులు వెంకటేషులు, బాలాజిలు ఉన్నారు. ఆమె గత పదిహేను ఏళ్లుగా పెద్ద కుమారుడు వెంకటేషులు వద్దనే ఉంటోంది. తన చిన్న కుమారుడు ఏనాడూ తన బాగోగులు చూడలేదని, ఇప్పుడు తన వద్దనున్న నగదు, బంగారం ఇవ్వాలంటూ రోజూ ఫోను చేసి వేధిస్తున్నట్టు ఆవేదనను తెలియజేసింది. ఒకనాడు కూడా తన క్షేమ సమాచారాన్ని వాకబు చేయని వాడికి తన సొత్తు ఎందుకివ్వాలని వాపోయింది. తన రెండో కుమారుడు బాలాజి వల్ల తనకు, తన పెద్ద కుమారుడు, కోడలుకు ప్రాణహాని ఉందని డీఎస్పీకి విన్నవించింది. చివరికి తను చనిపోతే తలకొరివి పెట్టడానికి కూడా చిన్న కుమారుడు రాకూడదని వృద్ధురాలు తెలియజేయడం కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement