ఎన్‌హెచ్‌ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు? | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు?

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

పుట్టపర్తి: చిలమత్తూరు మండలం కోడూరు నుండి ముదిగుబ్బ వరకు జరుగుతున్న జాతీయ రహదారి 342ను ఎన్‌హెచ్‌ రీజనల్‌ ఆఫీసర్‌ ఆర్‌కే సింగ్‌ పరిశీలించారు. బుధవారం ఆ మార్గంలో రోడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించి, పనులు ఆలస్యమవుతున్న కారణాన్ని సంబంధిత కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకుని, ఎప్పటిలోగా పూర్తి చేశారని విచారించారు. రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు. ఆయన వెంట పలువురు అధికారులు, కాంట్రాక్టర్లు ఉన్నారు.

రెజ్లింగ్‌ జాతీయస్థాయి

పోటీలకు మణిదీప్‌

బత్తలపల్లి: త్వరలో ఢిలీల్లోలో జరగనున్న జాతీయస్థాయి రెజ్లింగ్‌ (కుస్తీ) పోటీలకు బత్తలపల్లి మండలం మాల్యవంతం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి చిట్రా మణిదీప్‌ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు చెన్నకృష్ణారెడ్డి, పీడీ నాగరాజు తెలిపారు. బుధవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా కారంపూడిలో ఈ నెల 12వ తేదీన నిర్వహించిన రాష్ట్రస్థాయి 70వ ఎస్‌జీఎఫ్‌ఐ(స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) అండర్‌–14 75 కేజీల విభాగంలో మణిదీప్‌ బంగారు పతకం సాధించడంతో జాతీయస్థాయి పోటీల్లో ఆడేందుకు అర్హత సాధించాడన్నారు.

హత్యాయత్నం కేసులో

నిందితుడి అరెస్టు

అగళి: పాతకక్షలు, ఇంటి స్థలం వివాదంలో మండలంలోని హనుమనపల్లిలో అదే గ్రామానికి చెందిన మహేంద్ర అనే వ్యక్తిపై మంగళవారం హత్యాయత్నానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని పోలీసులు 24 గంటల్లోపు అరెస్టు చేశారు. బుధవారం సర్కిల్‌ కార్యాలయంలో అగళి ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ రమేష్‌బాబు అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హనుమనపల్లి గ్రామానికి మహేంద్ర, నరసింహమూర్తిల కుటుంబాల మధ్య గత కొతకాలంగా ఇంటి స్థలం విషయంలో పాతకక్షలు ఉన్నాయి. మంగళవారం వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఘటనపై మహేంద్ర, తన సోదరుడు లక్ష్మీరంగనాథ్‌తో కలిసి పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, నరసింహమూర్తి, తన అల్లుడైన మహాలింగప్పతో కలిసి వారిని ద్విచక్ర వాహనంలో వెంబడించి, అడ్డుకొని మహేంద్రపై మచ్చుకొడవలితో దాడి చేయడంతో రక్త గాయాలయ్యాయి. స్థానికులు, బాధితుడి సోదరుడు అడ్డుకోవడంతో నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ రమేష్‌బాబు తన సిబ్బంది పుట్టప్ప, నాగరాజు, లక్ష్మీకాంత్‌తో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం నిందితుడు గ్రామంలోని ఇంటికి వచ్చాడన్న సమాచారంలో పోలీసులు నరసింహమూర్తిని అదుపులోకి తీసుకొని, దాడికి ఉపయోగించిన మచ్చుకొడవలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించినట్టు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement