పొత్తు పేరుతో ‘పచ్చ’ పన్నాగం | - | Sakshi
Sakshi News home page

పొత్తు పేరుతో ‘పచ్చ’ పన్నాగం

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

సాక్షి, పుట్టపర్తి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పేరుతో ‘పచ్చ పార్టీ’ నేతలు భారీ పన్నాగం పన్నారు. జిల్లా పరిధిలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా...ఐదు చైర్మన్‌ స్థానాలు బీసీలకే రిజర్వ్‌ చేసి అన్నింటా తామే రేసులో నిలిచారు. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో ఈసారి కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున జనసేనతో పాటు బీజేపీ నాయకులు టీడీపీ కండువాలు వేసుకుని ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్న చర్చ నడుస్తోంది.

వార్డుల్లో ఇస్తాంలే..

మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలన్నీ దాదాపుగా టీడీపీకే ఖరారు కాగా, చైర్మన్‌ సీటు కోసం టీడీపీలో భారీ లాబీయింగ్‌ నడుస్తోంది. ఎవరికి వారుగా చాట్‌ జీపీటీలో డిజైన్‌ చేసుకుని వాట్సాప్‌లలో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు విడుదల చేయడంతో ఆయా వర్గాల నుంచి భారీ లాబీయింగ్‌ నడుస్తోంది. రిజర్వేషన్లు తేలిన సమయం నుంచి చైర్మన్‌ సీటుకు రాయ‘బేరాలు’ నడుస్తున్నట్లు తెలిసింది. దీంతో బీజేపీ, జనసేన నేతలంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో వారికి వార్డుల్లో సీట్లు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక టీడీపీ నాయకులు కూటమిలోని పార్టీల వారికి ‘‘ మీకు వార్డులే ఎక్కువ...సర్దుకోండి’’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు ఈ రెండు పార్టీల నేతలు వాపోతున్నారు.

కదిరిలో ‘కందికుంట’ పెత్తనం..

కదిరిలో బీజేపీ జాతీయ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నప్పటికీ.. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పెత్తనం చెలాయిస్తున్నారు. బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. బీసీ మహిళకు రిజర్వేషన్‌ ఖరారు చేయడంతో ఆశావహుల జాబితా పెరిగింది. అయితే తెలుగు తమ్ముళ్లే బరిలో ఉంటారని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరఫున వార్డుల్లో కౌన్సిలర్‌ సీట్లు కూడా కష్టంగా మారింది. మరోవైపు కదిరిలో జనసేన పేరు కూడా వినిపించలేదు.

మడకశిరలో టీడీపీ అధ్యక్షుడి హడావుడి..

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న మడకశిరలో మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. దీంతో ఆయన ఒక్కసారిగా హడావుడి చేస్తున్నారు. ఎవరిని బరిలో దింపాలని కార్యకర్తలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వద్ద కొందరు ఆశావహులు చర్చలు చేస్తున్నా... ఫలితం ఉండకపోవచ్చని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. తానుపార్టీ జిల్లా అధ్యక్షుడినని.. స్థానిక ఎమ్మెల్యేనని... కనుక తాను చెప్పిన వారే పోటీలో ఉంటారని రాజు సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది.

హిందూపురంలో పీఏల రాజకీయం..

బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శులే (పీఏ) రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ‘పురం’లో పీఏలే పాలన సాగిస్తుంటారు. ఇక్కడ మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో అభ్యర్థుల వేట మొదలైంది. ఎవరిని బరిలో దింపాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న సీనియర్లు గంపెడాశలు పెట్టుకోగా...ఈసారి కొత్తగా జనసేనలో చేరిన నాయకుడు కూడా ఈ స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరెన్ని ప్రణాళికలు వేసినా బాలకృష్ణ పీఏల ముందు పారవని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే వారు ఒకరిద్దరు అభ్యర్థులను సైతం సిద్ధం చేసి బాలకృష్ణను ఒప్పించే పనిలో నిమగ్నమైనట్లు చర్చించుకుంటున్నారు.

మంత్రి చెప్పిన వారికే..

పెనుకొండ మున్సిపల్‌ చైర్మన్‌ రేసులో టీడీపీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అయితే మంత్రి సవిత చెప్పిన వారే టీడీపీ తరఫున బరిలో ఉంటారని తెలిసింది. ఈస్థానం బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆయా కులాల నుంచి భారీ పోటీ నెలకొంది. అయితే మంత్రి మాట వినే వారే బరిలో నిలుస్తారు. మరోవైపు ఎంపీ పార్థసారథి ప్రయత్నాలు చేస్తున్నా.. ఆయన మాట నెగ్గదన్న ప్రచారం జరుగుతోంది. ఎవరు బరిలో ఉన్నా.. మంత్రి సవిత ఖర్చు భరించాలని ఎంపీ వర్గీయులు చర్చ ప్రారంభించారు.

మున్సిపల్‌ పీఠాలపై టీడీపీ కన్ను

కూటమిలోని మిగతా పార్టీలకు

మొండిచేయి

అన్ని స్థానాల్లో బరిలో దిగాలని ప్రణాళిక

రిజర్వేషన్‌ ఖరారులో

చక్రం తిప్పిన ‘తమ్ముళ్లు’

బీసీల పేరుతో బీజేపీ,

జనసేన పార్టీలకు చెక్‌

ఈసారీ పచ్చకండువాతోనే

జనసైనికుల ప్రచారం!

జన‘సున్నా’నే..

జిల్లా కేంద్రంలో జనసేన నుంచి చైర్మన్‌ పోటీ కోసం ఆశావహులు పెరిగిపోయారు. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఏం చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఓసీలకు నిరాశ ఎదురైంది. అయితే టీడీపీ నేతలకే అవకాశం ఇస్తారా? లేక జనసేనకు ఇస్తారా? అనేది తెలియరాలేదు. దీంతో టీడీపీ తరఫున పోటీ ఎవరు చేస్తారనే దానిపై మాజీ మంత్రి వద్ద లాబీయింగ్‌ జరుగుతోంది. జనసేనకు సీటిస్తే తాము ఆ జెండా వేసుకుని ప్రచారం చేయలేమని, అందువల్లే చెప్పినట్లు వినే టీడీపీకి చెందిన బీసీకే సీటివ్వాలని ‘తమ్ముళ్లు’ డిమాండ్‌ చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.

మంత్రి ‘సత్య’మాట చెల్లదంట..

ధర్మవరం మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం కోసం టీడీపీ నాయకులే లాబీయింగ్‌ చేస్తున్నారని సమాచారం. బీజేపీ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నాయకులకు చైర్మన్‌ బరిలో నిలిచే అవకాశం కనిపించలేదు. ఒకరిద్దరు ముందుకు వచ్చినా వారిని పరిటాల శ్రీరాం అనుచరులు ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్‌ ఇవ్వడంతో సైలెంట్‌ అయ్యారు. మరోవైపు జనసేన నుంచి కూడా పోటీలో ఉండరని టీడీపీ కార్యకర్తలే ప్రచారం చేస్తుండటం విశేషం. ఈ స్థానం జనరల్‌కు రిజర్వు కావడంతో ఆశావహుల జాబితా పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement