కలెక్టర్‌కు జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు జాతీయ అవార్డు

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

ప్రశాంతి నిలయం: రైతులకు సకాలంలో బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో విశేష కృషి చేసిన కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. సోమవారం న్యూ ఢిల్లీలోని నేషనల్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ ‘ప్రధాన మంత్రి ధన్‌–ధాన్య కృషి యోజన’ అవార్డును అందుకున్నారు. జిల్లాలోని 3,69,970 మంది రైతులకు రూ.4,992 కోట్లు ఆర్థిక చేయూత దక్కేలా కలెక్టర్‌ కృషి చేశారు. జాతీయ అవార్డు తనతోపాటు జిల్లా యంత్రాంగంపై మరింత బాధ్యతను మరింత పెంచిందని కలెక్టర్‌ తెలిపారు.

ఆర్పీఎఫ్‌ ఏఎస్పీకి

రాష్ట్రపతి పోలీస్‌ పతకం

గుంతకల్లు: రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్‌)లో విశిష్ట సేవలందించిన గుంతకల్లు డివిజన్‌ రేణిగుంట ఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ కె.రాజగోపాల్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్‌ పతకం అందుకున్నారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఆర్పీఎఫ్‌ రైజింగ్‌ డే కార్యక్రమంలో భాగంగా ఆయనకు మెడల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గుంతకల్లు డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఆకాష్‌ కుమార్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, కర్తవ్య నిర్వహణతోపాటు సేవాతత్పరతకు గాను రాజగోపాల్‌రెడ్డికి దక్కిన గౌరవమని కొనియాడారు. ఆయన సాధించిన ఈ ఘనత ఆర్పీఎఫ్‌ సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు.

రేపటి నుంచి

పెన్షన్‌ అదాలత్‌

పుట్టపర్తి అర్బన్‌: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఈనెల 14, 15 తేదీల్లో జీపీఎఫ్‌/పెన్షన్‌ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా ట్రెజరీ, అకౌంట్స్‌ అధికారి నాగరాజరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్‌ జీపీఎఫ్‌, పెన్షన్‌ సమస్యలను పరిష్కరించడంతో పాటు జీపీఎఫ్‌ సస్పెన్స్‌ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అదాలత్‌లో పాల్గొనాలనుకునే వారు ఉదయం 10 గంటల్లోపు హాజరు కావాలన్నారు. జీపీఎఫ్‌ సంబంధించి భౌతిక, డిజిటల్‌ రికార్డులు, చందాల వివరాలు, ఓచర్లు, రికవరీ వివరాలు, హెచ్‌ఓఏ వివరాలు, పెండింగ్‌ అంశాలకు సంబంధించిన రికార్డులను తీసుకురావాలన్నారు. పెండింగ్‌ పెన్షన్‌, జీపీఎఫ్‌, కుటుంబ పెన్షన్‌ సమస్యలు, ఆలస్యమైన సెటిల్‌మెంట్లు, పీపీఓ చెల్లింపులకు సంబంధించిన సమస్యలున్నవారు తమ పీపీఓ, జీపీఎఫ్‌ ఖాతా వివరాలను, సంబంధిత పత్రాలను తీసుకురావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement