రూ.లక్ష తీసుకున్నా.. పనిచేయడం లేదు | - | Sakshi
Sakshi News home page

రూ.లక్ష తీసుకున్నా.. పనిచేయడం లేదు

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

ప్రశాంతి నిలయం: ‘నా పేరిట భూమిని పాసు పుస్తకంలో ఎక్కిస్తానని సోమందేపల్లి తహసీల్దార్‌ మారుతి ప్రసాద్‌ రూ.లక్ష తీసుకున్నాడు. నేను నెలల తరబడి రోజూ కార్యాలయానికి వెళ్తున్నా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడు. ఇప్పటికీ నా పేరుపై పాసు పుస్తకాలు మంజూరు చేయలేదు’ అని సోమందేపల్లి మండలం మాగే చెరువుకు చెందిన రైతు బువ్వప్పగారి వెంకటరాముడు సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జేసీ మౌర్య భరద్వాజ్‌కు ఫిర్యాదు చేశాడు. మాగేచెరువు పొలం సర్వే నంబర్‌ 164లో 18.85 ఎకరాలు ఉండగా... తనకు హక్కు మేరకు 1.57 ఎకరాలు దక్కాలని, కానీ పాసుపుస్తకంలో 70 సెంట్లు మాత్రమే నమోదు చేశారని, ఈ సమస్య పరిష్కరించమని తహసీల్దార్‌ మారుతి ప్రసాద్‌ను కోరగా రూ.లక్ష డిమాండ్‌ చేశారన్నారు. తాను అప్పు చేసి డబ్బులిచ్చినా... 87 సెంట్ల భూమి పాసుపుస్తకంలో నమోదు చేయలేదన్నారు. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌.. విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని పెనుకొండ ఆర్డీఓను ఆదేశించారు. సోమవారం ప్రశాంతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సిద్దరాంపురం గ్రామ సర్వే నంబర్‌ 745లోని 3.54 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా దక్కిందని, అయితే గ్రామానికి చెందిన చంద్ర, మాణిక్యం, ఉల్లక్కి తదితరులు తమపై దౌర్జన్యం చేసి తమ పొలాన్ని కబ్జా చేసి చదును చేస్తున్నారని సిద్దరాంపురం గ్రామానికి చెందిన చెడిపోతులు రామకృష్ణ, శంకర్‌, ఆదినారాయణ జేసీకి ఫిర్యాదు చేశారు.

మొత్తంగా 296 అర్జీలు అందగా...వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. జేసీ మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ఎస్‌డీసీ విజయకుమారితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యర్థులతో కుమ్మకై ్క..

‘‘సోమందేపల్లి తహసీల్దార్‌ మారుతి ప్రసాద్‌ మా ప్రత్యర్థులతో కుమ్మకై ్క పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని మాకు దక్కకుండా చేస్తున్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకుని న్యాయం చేయండి’’ అని సోమందేపల్లి మండలం కూకటిమానిపల్లికి చెందిన అన్నదమ్ములు కిష్టప్ప, నరసింహప్ప పరిష్కార వేదికలో జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూకటిమానిపల్లిలో సర్వే 79లో తమ పూర్వికుల నుంచి 7.12 ఎకరాల భూమి తమకు సంక్రమించిందన్నారు. కొందరు తమ భూమిపై నకిలీ పత్రాలు తయారు చేసుకోగా, రెవెన్యూ అధికారులు వారికే పాసుపుస్తకాలు మంజూరు చేశారన్నారు. దీనిపై గతంలో జేసీకి ఫిర్యాదు చేయగా, న్యాయం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారని, అయితే తహసీల్దార్‌ మారుతి ప్రసాద్‌ తమ ప్రత్యర్థులతో కుమ్మకై ్క వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

భూ పరిహారం ఇప్పించండి..

2006లో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా తాము భూములు, ఇల్లు కోల్పోయామని, ఇప్పటి వరకు పరిహారం అందలేదని మర్రిమాకులపల్లి రైతులు చంద్రశేఖర్‌, ప్రకాష్‌, సరోజమ్మ, ఆదినారాయణ, ఆంజనేయులు, వెంగమనాయుడు, జయచంద్ర తదితరులు జేసీని కోరారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. 2020లో భూ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం అందించారని, ఈ క్రమంలో తమకు చెక్కులు ఇచ్చినా ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో తామంతా కోర్టును ఆశ్రయించగా... కేసు విచారించిన కోర్టు వెంటనే పరిహారం ఇవ్వాలని గత సెప్టెంబర్‌ 23న ఆదేశిస్తూ తీర్పు చెప్పిందన్నారు. ఆ మేరకు తమకు పరిహారం చెల్లించాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌కు కోరారు.

విద్యుత్‌ కంపెనీలు

మా భూములను ఆక్రమిస్తున్నాయి

తమకు సంబంధం లేకుండానే తమ భూముల్లో ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీలు విద్యుత్‌ పరికరాలు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నాయని రామగిరి మండలం మక్కినవారిపల్లి, దుబ్బార్లపల్లి, పేరూరు, కొండాపురం గ్రామాలకు చెందిన 40 మంది రైతులు జేసీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తమ భూముల్లో ఏళ్ల తరబడి పెంచిన ఉద్యాన పంటలు ఉన్నాయని, విద్యుత్‌ పరికరాలు ఏర్పాటు వల్ల తాము పూర్తిగా నష్టపోతామన్నారు. వెంటనే సదరు ప్రైవేట్‌ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని పనులు నిలిపి వేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.

సోమందేపల్లి తహసీల్దార్‌పై పీజీఆర్‌ఎస్‌లో ఓ రైతు ఫిర్యాదు

మా భూమి మాకు కాకుండా

చేస్తున్నారని మరో రైతు గగ్గోలు

పరిష్కార వేదికకు 296 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement